IPL Matches: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 19వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ ఎడిషన్ కి ముందు ఐపీఎల్ చరిత్రలో 250+ ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన భారత ఆటగాళ్లలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రవీంద్ర జడేజా ఈ లిస్టులో ఉన్నారు. ఈ ఐదుగురు ఆటగాళ్లు అన్ని ఐపీఎల్ సీజన్లలో కొనసాగుతూ తమ ఫ్రాంచైజీలకు నాయకత్వం వహించారు. దినేష్ కార్తీక్ మినహా మిగతా నాలుగు ప్లేయర్స్ ఐపీఎల్ 2026లో ఆడబోతున్నారు. మార్చి 28వ తేదీన ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ తో ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది.
ఎంఎస్ ధోని:
278 మ్యాచ్‌లతో ఎంఎస్ ధోని 250+ మ్యాచ్‌లలో ఐపీఎల్ రికార్డు జాబితాలో ముందు వరుసలో కొనసాగుతున్నాడు. 2008లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ఐపీఎల్‌లో డెబ్యూ చేసిన ధోని 2018 వరకు జట్టు సారథ్య బాధ్యతలు వహించాడు. అలాగే రెండు సీజన్లలో రైజింగ్ పూనే సూపర్ జెయింట్ తరపున ఆడిన అనంతరం 2018లో మళ్లీ CSK కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోని, ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నారు. 2026లో ధోని రెగ్యులర్ ప్లేయర్‌గా ఉంటాడా లేదా ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడుతాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
రోహిత్ శర్మ:
హిట్ మ్యాన్ రోహిత్ 272 మ్యాచ్‌లు ఆడాడు. డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఐపీఎల్ డెబ్యూ చేసిన రోహిత్ 2011లో ముంబై ఇండియన్స్‌లో చేరి ఇప్పటి వరకు ఆడుతున్నారు. ఐపీఎల్‌లో ముంబై జట్టుకి 5 టైటిల్స్ అందించిన ఘనత రోహిత్ కి దక్కుతుంది.
►ALSO READ | Kohli IPL Records: ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ 6 రికార్డులు ఇవే!
విరాట్ కోహ్లీ:
కింగ్ కోహ్లీ 267 మ్యాచ్‌లు, మొత్తం RCB తరపున ఆడాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ కోసం అన్ని సీజన్లలో ఆడిన ఏకైక ప్లేయర్ అతడే. 2013–2021 మధ్య RCB జట్టుకి కెప్టెన్సీగా కూడా పని చేశాడు. 8,661 పరుగులతో కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.
దినేష్ కార్తీక్:
దినేష్ కార్తీక్ ఐపీఎల్ 2008–2023లో 257 మ్యాచ్‌లు ఆడారు. ఇతడి కెరీర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ లయన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ జట్లలో ఆడారు. ఇప్పుడు RCB బ్యాటింగ్ కోచ్ గా విధులు నిర్వహిస్తున్నాడు.
రవీంద్ర జడేజా:
జడేజా 254 మ్యాచ్‌లలో ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ ద్వారా ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన జడ్డూ.. అనంతరం కోచి టస్కర్స్, సీఎస్కే, గుజరాత్ లయన్స్ తర్వాత మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ లో చేరారు. IPL 2026కి ముందు CSK నుంచి జడేజాని మళ్లీ రాజస్థాన్ ట్రేడ్ చేసుకుంది.
300 మ్యాచ్‌ల రికార్డు:
మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో ఎవరు 300 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడే మొదటి ఆటగాడు అవుతారో అనేది వేచి చూడాలి. ధోని 2026లో ప్రతి మ్యాచ్ ఆడకపోవచ్చు. రోహిత్ (272) 5 మ్యాచ్‌లతో కోహ్లీ (267) కంటే ముందున్నారు. రోహిత్ వచ్చే సీజన్‌లో 300 మ్యాచ్‌ల మైలురాయిని చేరుకునే అవకాశం కనిపిస్తుంది.
