హైదరాబాద్: వరుస ఎన్ కౌంటర్లు, లొంగుబాట్లతో సతమతమవుతోన్న మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. నక్సలైట్ టాప్ కమాండర్, పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ (CCM) రామ్‌ధేర్ మజ్జి సరెండర్ అయ్యారు. తన బృందంతో కలిసి సోమవారం (డిసెంబర్ 8) ఛత్తీస్‌గఢ్ బకర్ కట్టాలోని పోలీస్ స్టేషన్‌లో మజ్జి లొంగిపోయారు. అతని తలపై రూ. 1 కోటి రివార్డు ఉంది.
మాజ్జీతో పాటు సరెండరైన వారిలో చందు ఉసెండి, లలిత, జాంకీ, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుఖేష్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత ఉన్నారు. ఇటీవల మారేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్లో చనిపోయిన అగ్రనేత మాడ్వి హిడ్మాతో సమానంగా రామ్‌ధేర్ మజ్జిని పరిగణించేవారు. అలాంటి కీలక నేత సరెండర్ కావడం మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బే.
మావోయిస్ట్ పార్టీ శకం ముగిసినట్టేనా..!
వచ్చే ఏడాది మార్చి కల్లా మావోయిస్టు పార్టీని అంతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్కగార్తో మావోయిస్టు పార్టీ కకావికలమవుతున్నది. కేంద్రం పెట్టుకున్న లక్ష్యానికి నాలుగు నెలల ముందే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన అగ్రనేతల్లో నంబాల కేశవరావును ఇప్పటికే ఎన్‌కౌంటర్‌చేసిన భద్రతా బలగాలు.. ఇప్పుడు మడవి హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశాయి.
మరోవైపు మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి సీనియర్ లీడర్లు ఇప్పటికే లొంగిపోయారు. మరో అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్దేవ్జీ సైతం పోలీసుల అదుపులో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇక ఉద్యమంలో మిగిలిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్గణపతి మాత్రమే. ఆయన కూడా వయోభారం, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారని ప్రచారం జరుగుతున్నది. ఈ లెక్కన మావోయిస్టు పార్టీ మనుగడ ఇక కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
