
- కేబినెట్లో 11 మంది ఓసీలు
- బీసీలు నలుగురు
- ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి స్థానం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో అగ్రకులాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది. కొత్తగా మంత్రి వర్గంలోకి తీసుకున్న ఆరుగురిలో నలుగురు ఓసీలు ఉండగా, ఒకరు ఎస్టీ, మరొకరు బీసీ కులాలకు చెందినవారున్నారు. మొత్తం 18 మందితో కూడిన కేబినేట్‌లో పది మంది ఓసీలు(రెడ్లు ఆరుగురు, వెలమలు నలుగురు, కమ్మ ఒకరు) ఉండగా, బీసీలు నలుగురు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. రెడ్ల నుంచి ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉండగా, తాజా విస్తరణలో సబితా ఇంద్రారెడ్డికి చోటు కల్పించారు. అలాగే వెలమ నుంచి ఇప్పటి వరకు సీఎంగా కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు కేబినేట్‌లో కొనసాగుతుండగా విస్తరణలో హరీశ్‌రావు, కేటీఆర్‌కు అవకాశం కల్పించారు. టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఏర్పడిన ప్రభుత్వంలో కమ్మ వర్గానికి కేబినేట్‌లో చోటుదక్కలేదు. ప్రస్తుత కేబినేట్ విస్తరణలో ఆ వర్గానికి చెందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కి మంత్రిగా అవకాశం వచ్చింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో ఓసీ జనాభా 8 శాతం ఉండగా 61 శాతం పదవులు ఆ వర్గాల వారికే దక్కాయి.
బీసీలకు 22 శాతం పదవులు
బీసీల నుంచి ఈటల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఇప్పటికే మంత్రులుగా కొనసాగుతుండగా, మంత్రివర్గ విస్తరణలో ఈ వర్గం నుంచి కొత్తగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు అవకాశం కల్పించారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం రాష్ట్రంలో బీసీల జనాభా 52 శాతం ఉండగా 22 శాతం మంత్రి పదవులే దక్కాయి.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరు
ఎస్సీ నుంచి కొప్పుల ఈశ్వర్, మైనార్టీల నుంచి మహమూద్ అలీ మంత్రులుగా ఉండగా.. ఎస్టీ నుంచి ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం లేకుండా ఏడు నెలలు గడిచిపోయింది. విస్తరణలో ఎస్టీకి చెందిన సత్యవతి రాథోడ్‌కు అవకాశమిచ్చారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న ఎస్సీలకు, 10 శాతం ఉన్న ఎస్టీలకు, 14 శాతం మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవే దక్కింది. మొత్తంగా తెలంగాణలో 92 శాతం జనాభా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎస్టీ, మైనారిటీలకు 38 శాతం పదవులే దక్కాయి.
ముగ్గురికి మొదటిసారి
కేబినేట్ విస్తరణలో చోటు దక్కించుకున్న ఆరుగురులో ముగ్గురికి గతంలో మంత్రి పదవి చేపట్టిన అనుభవం ఉండగా ముగ్గురికి కొత్తగా అవకాశం దక్కింది. కొత్తగా మంత్రి పదవి దక్కినవారిలో సత్యవతి రాథోడ్, గంగుల, పువ్వాడ అజయ్ ఉన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నలుగురు..
కేబినేట్‌లో నలుగురు మంత్రులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ జిల్లా నుంచి హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ మంత్రులుగా ఉండగా కొత్తగా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు అవకాశం రావడంతో మంత్రుల సంఖ్య నాలుగుకు చేరింది.