ఆదాయపు పన్ను చట్టం కింద వ్యక్తులు, కుటుంబాలు.. అలాగే విదేశాల్లోని భారతీయులు పన్ను భారాన్ని తగ్గించేందుకు అనేక మినహాయింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ మినహాయింపులను సక్రమంగా పొందాలంటే సరైన రికార్డులు, ఆధారాలకు సంబంధించిన డాక్యుమెంట్లు అందించటం అత్యంత కీలకం. అయితే ఆదాయపు పన్ను చట్టం కింద 10 రకాల ఆదాయాలు పన్ను రహితమైనవిగా చార్టర్డ్ అకౌంటెంట్ ఆశిష్ నిరాజ్ చెప్పారు. వీటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..
1. వ్యవసాయ ఆదాయం – సెక్షన్ 10(1)
వ్యవసాయ భూమి నుంచి పొందిన ఆదాయం, అద్దె రూపంలో వచ్చిన ఇన్కమ్ లేదా ఆ భూమిపై ఉన్న నివాస గృహం, స్టోర్ రూం వంటి భవనాల అద్దె ఆదాయాలు పూర్తిగా పన్ను నుంచి మినహాయింపుకు అర్హమైనవి.
2. కుటుంబం నుండి పొందిన ఆదాయం – సెక్షన్ 10(2)
హిందూ అన్ డివైడెడ్ ఫ్యామిలీ(HUF) ఆదాయం నుంచి ఒక సభ్యుడు పొందిన వాటా, ఆ మొత్తమే కానీ ఏదైనా ఆస్తుల ద్వారా వచ్చినదైనా పన్ను నుంచి మినహాయింపుకు అనుకూలం.
3. లీవ్ ట్రావెల్ కన్సెషన్ – సెక్షన్ 10(5)
ఉద్యోగులు తమ కుటుంబంతో కలసి దేశంలో చేసిన పర్యటనకు సంబంధించిన ట్రావెల్ అలవెన్స్ నిబంధనలకు లోబడి పన్ను నుంచి మినహాయింపులకు అనుమతించబడ్డాయి.
4. గ్రాట్యుయిటీ – సెక్షన్ 10(10)
ఉద్యోగ విరమణ సమయంలో పొందే సింగిల్ టైం గ్రాట్యుయిటీ చెల్లింపులు చట్టంలో పేర్కొన్న పరిమితుల మేర పన్ను నుంచి మినహాయింపును పొందుతాయి.
5. ప్రావిడెంట్ ఫండ్ చెల్లింపులు – సెక్షన్ 10(11) & 10(12)
పబ్లిక్, స్టాట్యూటరీ, రికగ్నైజ్డ్ లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో అన్రికగ్నైజిడ్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా పొందిన మొత్తాలు పన్ను నుంచి మినహాయింపు పొందుతాయి.
6. హౌస్ రెంట్ అలవెన్స్ – సెక్షన్ 10(13A)
ఇంటి అద్దె చెల్లించే జీతగాళ్లు నిబంధనలకు అనుగుణంగా HRAపై పన్ను మినహాయింపును పొందవచ్చు.
7. లైఫ్ ఇన్సూరెన్స్ పరిహారం – సెక్షన్ 10(10D)
లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా పొందే మొత్తం, బోనస్ సహా, నిబంధనలకు అనుగుణంగా పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.
8. భాగస్వామ్య లాభం – సెక్షన్ 10(2A)
పార్ట్‌నర్ ఒక సంస్థ నుండి పొందే లాభంలో భాగం, అతని వ్యక్తిగత ఆదాయంగా పరిగణించబడదు. అందువల్ల అది పూర్తిగా పన్ను రహితంగా ఉంటుంది.
9. నాన్ రెసిడెంట్ ఇండియన్ ఆదాయం – సెక్షన్ 10(4)
NRIలు నిర్దిష్ట సెక్యూరిటీలు, బాండ్‌లు, NRE అకౌంట్లలోని వడ్డీపై లేదా పత్రాల విలువలతో సంబంధిత ఆదాయంపై పన్ను మినహాయింపునకు అర్హులు.
10. విదేశీ రాయబారులకు వేతనం – సెక్షన్ 10(6)(ii)
ఇక చివరిగా దేశంలో పనిచేసే విదేశీ రాయబారులు, కాన్సులేట్ అధికారులు తమ దేశ అధికారులకు ఇచ్చిన సదుపాయాలపై పన్ను మినహాయింపును పొందవచ్చు.
అయితే వీటికి సంబంధించిన డాక్యుమెంట్లు సక్రమంగా నిర్వహించడం ద్వారా మాత్రమే పన్ను రాయితీల నిజమైన ప్రయోజనం పొందవచ్చని సీఏ హెచ్చరించారు.
