తొర్రూరు, వెలుగు : ఎస్సారెస్పీ కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో ఆర్డీవో ఆఫీస్ ఆస్తులు జప్తు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీవో ఆఫీస్ ఆస్తులను కోర్టు సిబ్బంది సమక్షంలో బాధిత రైతులు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్సారెస్పీ డీబీఎం 69 ఎల్ కెనాల్ నిర్మాణానికి దంతాలపల్లి మండలంలో 2009–10లో ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. దంతాలపల్లికి చెందిన కొరిపల్లి శ్రీనివాస్ రెడ్డి, సాధు ధర్మారెడ్డి, కొరిపల్లి వెంకన్నకు చెందిన 9 ఎకరాల భూములు కోల్పోయారు. ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం చెల్లించగా, ఆ భూములకు మార్కెట్ లో రేట్ ఎక్కువగా ఉండడంతో నష్టపోయామని భావించిన రైతులు 2011లో జిల్లా కోర్టును ఆశ్రయించారు.
అప్పటి ఆర్డీవో హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా సదరు కేసును జిల్లా కోర్టుకు అప్పగించింది. జిల్లా కోర్టులో వాదోపవాదాల అనంతరం భూముల విలువ, మార్కెట్ ను బట్టి రూ.2.47 కోట్లు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చినప్పటికీ, పరిహారం ఇవ్వలేదు. దీంతో అక్టోబర్ 8న తొర్రూరు ఆర్డీవో ఆఫీస్ ఆస్తులు జప్తు చేయాలని జిల్లా జడ్జి అబ్దుల్ రఫీ తీర్పునిచ్చారు. ఈ మేరకు బాధిత రైతులు న్యాయవాది, కోర్టు సిబ్బంది సమక్షంలో తొర్రూరు ఆర్డీవో ఆఫీస్‌లోని కంప్యూటర్లు, టేబుళ్లు, ఫర్నిచర్ స్వాధీనం చేసుకున్నారు.
