ఎక్కడి పనులు అక్కడే .. బిల్లులురాక లబోదిబోమంటున్నకాంట్రాక్టర్లు 

ఎక్కడి పనులు అక్కడే .. బిల్లులురాక లబోదిబోమంటున్నకాంట్రాక్టర్లు 
  • గత ప్రభుత్వం నిధులివ్వక అసంపూర్తిగా మన ఊరు - మన బడి పనులు 

మెదక్, కౌడిపల్లి, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో వసతులు మెరుగుపరిచేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 'మన ఊరు  మన బడి' పథకం కింద చేపట్టిన పనులు ఎక్కడికక్కడ అసంపూర్తిగా మిగిలిపోయాయి. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆశించిన స్థాయిలో జరగకపోగా, అసౌకర్యాలతో స్టూడెంట్స్​, టీచర్స్​ అవస్థలు పడుతున్నారు. మరోవైపు చేసిన పనులకు బిల్లులు రాక కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు.  జిల్లాలో మన ఊరు - మన బడి కింద మొత్తం 313 స్కూల్స్​ఎంపికయ్యాయి.

అందులో 180 ప్రైమరీ, 44 అప్పర్​ ప్రైమరీ, 89 హైస్కూల్స్​ఉన్నాయి. ఆయా స్కూళ్లలో బిల్డింగ్​రిపేర్స్,  కాంపౌండ్​ హాల్స్​, టాయిలెట్స్​, డ్రింకింగ్ వాటర్​ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ పనులు, కిచెన్​షెడ్స్​, డైనింగ్​హాల్స్​ తదితర రూ.66 కోట్ల పనులు చేశారు. కానీ అప్పటి ప్రభుత్వం నుంచి రూ.36.57 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. 2023,- 24 అకాడమిక్​ ఇయర్​ ప్రారంభం నాటికి పనులు పూర్తి చేయాల్సి ఉండగా అప్పట్లో  ప్రభుత్వం అవసరమైన నిధులు సకాలంలో విడుదల చేయక పోవడంతో పనులు సక్రమంగా జరగలేదు. దాదాపు 100 స్కూళ్లలో మాత్రమే పనులు పూర్తికాగా మిగితా స్కూళ్లలో  పనులు పెండింగ్ లో ఉన్నాయి.  

దీంతో స్టూడెంట్స్​కు, టీచర్స్​కు ఇబ్బందులు తప్పడం లేదు.  కౌడిపల్లి మండలంలో 21 స్కూళ్లు మన ఊరు--  మన బడి కింద ఎంపికయ్యాయి. ఆయా స్కూళ్లలో పనులు చేసేందుకు రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో రూ.5 కోట్లకు సంబంధించి పనులు జరగ్గా రూ.3 కోట్లు పేమెంట్​చేశారు ఇంకా రూ.2 కోట్లు ఇవ్వాల్సి ఉంది. బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు మధ్యలోనే పనులు నిలిపివేశారు.

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం మారగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మన ఊరు మన బడి పథకాన్ని పక్కన పెట్టి, అమ్మ ఆదర్శ స్కూళ్ల కింద మౌలిక వసతులు మెరుగు పరిచే పనులు చేపట్టింది. దీంతో గతంలో మన ఊరు మన బడి పథకం కింద చేపట్టి అసంపూర్తిగా ఉన్న పనుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది.  

చేసిన పనులకు బిల్లులు రాక..

ఇదివరకు మన ఊరు మన బడి కింద ఆయా స్కూళ్లలో చేసిన పనులకు సంబంధించి రూ.9.50 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. దీంతో పనులు చేసిన కాంట్రాక్టర్లు లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం మన ఊరు మన బడి పథకం పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమ బిల్లుల పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కొల్చారం జడ్పీ హైస్కూల్​లో మన ఊరు మన బడి కింద పనులు చేసిన బిల్లు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వెంటనే పెండింగ్ బిల్లులు ఇప్పించాలంటూ లక్ష్మీనారాయణ గడిచిన సోమవారం ప్రజావాణిలో అర్జీ ఇచ్చారు. 

పనులు చేసి అప్పుల పాలైన 

మన ఊరు-  మన బడి కింద కౌడిపల్లి జడ్పీ హైస్కూల్​లో రూ.14 లక్షలతో  డైనింగ్ హాల్ నిర్మాణం, రూ.8 లక్షలతో కిటికీలు, తలుపుల బిగింపు, ప్లంబింగ్, డ్రింకింగ్​ వాటర్​ ఫెసిలిటీ, ఎలక్ట్రిసిటీ, మైనర్ రిపేర్ పనులు  చేయించా. మొత్తం రూ.22 లక్షలు ఖర్చు వచ్చింది. అప్పు తెచ్చి పనులు చేస్తే, రెండేళ్లవుతున్నా బిల్లులు మంజూరు కాకపోవడంతో నాలుగు తులాల బంగారం అమ్మేశా.  అయినా అప్పులు తీరకపోగా  అప్పిచ్చిన వారి ఒత్తిడి  భరించలేక నాలుగు గుంటల పొలం అమ్మకానికి పెట్టాను. 

జగన్​, కాంట్రాక్టర్, కౌడిపల్లి