కమలనాథులకు చిక్కని తమిళనాడు.. మోదీ కలలు మరోసారి కల్లలు కానున్నాయా ?

కమలనాథులకు చిక్కని తమిళనాడు.. మోదీ కలలు మరోసారి కల్లలు కానున్నాయా ?

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో  గెలిచి వరుసగా రెండోసారి  ముఖ్యమంత్రి  పదవిని అధిష్టించి స్టాలిన్ రికార్డు సృష్టించనున్నారా? అన్నాడీఎంకేను అడ్డుపెట్టుకొని ద్రవిడ సీమపై  కాషాయ జెండా ఎగరేయాలనుకుంటున్న ప్రధాని మోదీ కలలు మరోసారి కల్లలు కానున్నాయా? మత విద్వేషాలను కాదని ప్రగతిశీల లౌకికవాదానికి ఆ రాష్ట్ర ప్రజలు యథావిధిగా పట్టం కట్టనున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ తమిళనాడు వ్యాప్తంగా అవుననే సమాధానం ప్రతిధ్వనిస్తున్నది. దశాబ్ద కాలంగా దక్షిణాది రాష్ట్రాలను మొత్తంగా  ప్రత్యేకించి తమిళనాడును గుప్పిట పట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్న బీజేపీకి మరోసారి భంగపాటు తప్పదని సర్వేలు తేల్చి చెబుతున్నాయి.

ప్రాంతీయ పార్టీ జనతాదళ్(ఎస్) అండతో కర్నాటకలో 20 ఏళ్ల క్రితం తొలిసారి కాలుమోపిన బీజేపీ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగి స్థిరపడి అధికారం కూడా  చేపట్టింది. జనతాదళ్ (ఎస్) మూడవ స్థానానికి పడిపోయింది. ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, జన సేన ప్రాపకంతో ఆంధ్రప్రదేశ్​లో రెండేళ్ల క్రితం అధికారం  పంచుకోగలిగింది. తెలంగాణలో సమీప భవిష్యత్తులో  బీజేపీ అధికారంలోకి వస్తుందన్న ఆశలు, అంచనాలు ఆ పార్టీకే లేవు. 

కేరళలో మూడో స్థానంతో సరిపెట్టుకోక  తప్పని పరిస్థితి.  పుదుచ్చేరి దేశ రాజకీయాలను  ప్రభావితం చేయలేని ఒక చిన్న రాష్ట్రం. ఇక మిగిలింది తమిళనాడు. ప్రాంతీయ భాషా సాంస్కృతిక రాజకీయ అస్తిత్వ భావోద్వేగాలకు పేరెన్నికగన్న తమిళనాడులో పాగా వేయాలని దశాబ్ద కాలంగా మోదీ, అమిత్ షా ద్వయం చేయని ప్రయత్నం లేదు. అయితే స్థానిక ఎన్నికలు మొదలుకొని చట్టసభల ఎన్నికల దాకా ఏ దశలోనూ బీజేపీ కనీస  ఉనికిని  కాపాడుకోలేకపోయింది. 

అన్నాడీఎంకేలో కుమ్ములాటలు
2016లో  అన్నాడీఎంకే  అధినేత్రి జయలలిత మరణం తర్వాత ఆ పార్టీ తరఫున వరుసగా ముఖ్యమంత్రులైన పన్నీర్ సెల్వం,  పళనిస్వామి అంతర్గత  కుమ్ములాటలో తలమునకలై పరిపాలనను విస్మరించారు. అయినా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 39.71%  ఓట్లతో 75 సీట్లు సాధించి అన్నాడీఎంకే నాయకత్వంలోని ఎన్డీఏ తుదకు ప్రతిపక్షానికి  పరిమితమైంది. 

స్టాలిన్ నేతృత్వంలోని  సెక్యులర్ ప్రోగ్రెసివ్ ఆలయన్స్ 45.38%ఓట్లతో 159 స్థానాల్లో విజయం సాధించి  మూడింట రెండువంతుల ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది. గతంలో  స్టాలిన్ మేయర్​గా  పనిచేసిన చెన్నై మహానగరంలోని మొత్తం 22 అసెంబ్లీ స్థానాల్లో అధికార అన్నాడీఎంకే కూటమికి ఒక్కటి కూడా దక్కలేదంటే ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉందో అవగతమవుతుంది. 

డీఎంకే వ్యవస్థాపకుడు రాజకీయ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్తమయం(2018) తరువాత మూడేళ్లకు (2021 ) జరిగిన ఎన్నికల్లో స్టాలిన్ ఏ మేరకు కృతకృత్యుడౌతాడోనన్న రాజకీయ పరిశీలకుల అనుమానాలు పటాపంచలయ్యాయి. తొలిసారిగా  కరుణానిధి లేకుండా జరిగిన 2019  లోక్​సభ ఎన్నికల్లో సైతం డీఎంకే సేన 38 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అన్నాడీఎంకే  ఒక్క లోక్ సభ స్థానాన్ని మాత్రమే గెలుచుకోగలిగింది. స్టాలిన్ రాజకీయ సామర్థ్యం ఏమిటో ప్రపంచానికి తెలిసింది అప్పుడే.  

స్టాలిన్దే విజయం
2014 పార్లమెంటు  ఎన్నికల్లో సున్నాతో ప్రారంభమై 2019 నాటికి 38 దాకా చేరుకోవడానికి స్టాలిన్ నిరంతర కృషి పట్టుదల మిత్రపక్షాలతో సమన్వయమే కారణం. గత లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ సారధ్యంలోని సంకీర్ణం సెక్యులర్  ప్రోగ్రెసివ్ అలయన్స్ మొత్తం 39 లోక్ సభ స్థానాలలో ఘనవిజయం సాధించింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, అన్నాడీఎంకే మిత్రపక్షాలు వేర్వేరుగా పోటీచేసి సున్నా ఫలితాలతో బొక్క బోర్లాపడ్డాయి. మొత్తం 234 అసెంబ్లీ  సెగ్మెంట్లవారీగా చూస్తే స్టాలిన్ నాయకత్వంలోని  కూటమి 221 స్థానాల్లో ఆధిక్యం సాధించగా,  అన్నాడీఎంకే– ఎండిఎంకె  కూటమి పది స్థానాల్లో,  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కేవలం మూడు స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించాయి. 

ఎన్డీఏ కొచ్చిన ఆ మూడు సీట్ల  ఆధిక్యం  కూడా  మిత్రపక్షమైన పీఎంకేపార్టీదే.  ఏ ఒక్క సెగ్మెంటులోనూ  బీజేపీ  పైచేయి సాధించలేదు . ఈ నేపథ్యంలో అదే జోరు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతమై స్టాలిన్ నాయకత్వంలోని  సెక్యులర్  ప్రోగ్రెసివ్ అలయన్స్ భారీ విజయాన్ని నమోదు చేస్తుందని సర్వేల గణాంకాలు వెల్లడిస్తున్నాయి.   స్వాభిమానం నరనరాన జీర్ణించుకున్న తమిళ ప్రజలు ఐదేళ్ల కాలంలో స్టాలిన్ ప్రభుత్వాన్ని బీజేపీ పెద్దలు ముప్పు తిప్పలు పెట్టిన వైనాన్ని మర్చిపోలేదు. 

బీజేపీతో పొత్తుకు విజయ్ ​నో
అన్నాడీఎంకే  2021  అసెంబ్లీ  ఎన్నికల్లో  ఎన్డీఏతో  కలిసి పోటీచేసి దారుణంగా భంగపడింది. ఆ చేదు అనుభవంతో  గత  లోక్​సభ ఎన్నికల్లో బీజేపీకి  దూరమైన అన్నాడీఎంకే ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ జతకట్టి  పోటీ చేయడాన్ని తమిళ ప్రజలు  జీర్ణించుకోలేకపోతున్నారు.  వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల పంచన చేరి పట్టు బిగించాక వంచించి అధికారంలోకి రావడం బీజేపీకి అలవాటే.  అందుకు ఇటీవల మహారాష్ట్ర, బిహార్ రాష్ట్రాలే తార్కాణం.  ఇది  తెలిసీ  దక్షిణాదిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు,  జనసేన అధినేత  పవన్ కల్యాణ్, డీఎంకే  అధినేత  పళనిస్వామి బీజేపీని అక్కున చేర్చుకోవడం ఆ పార్టీలకు తాత్కాలిక ప్రయోజనాలు కలగవచ్చునేమోకానీ  దీర్ఘకాలికంగా భారీ నష్టం చవిచూడక తప్పదు.

ఎన్నికల ఫలితాలు ఎలావున్నా స్టాలిన్ ను  ఎదుర్కొనగలిగే  బలం బలగం ఉన్నప్పటికీ  అన్నాడీఎంకే ఆ సాహసం చేయలేకపోయింది. మరోవైపు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన తమిళ  హీరో విజయ్ స్థాపించిన  టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసింది. కానీ విజయ్ ఆ కుటిల ప్రయత్నాలు నిర్ద్వంద్వంగా తిరస్కరించి ఎన్నికల బరిలోకి దిగడం అభినందనీయం.  

కేంద్రంలో  మోదీ శకం ప్రారంభమయ్యాక ఒక దశాబ్ద కాలంలో జరిగిన 2016,  2021 అసెంబ్లీ ఎన్నికల్లో, 2014, 2019, 2024 లోక్ సభ ఎన్నికలు సహా ఏ ఎన్నికల్లోనూ డీఎంకే  బీజేపీతో జత కట్టలేదు.  పొత్తులు  లేకుండా ఒంటరిగా 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 సీట్లలో బరిలోకి దిగిన బీజేపీ కనీసం ఒక్కచోటైనా గెలుపొందలేక చేతులు కాల్చుకుంది.  మిగతా నాలుగు సాధారణ ఎన్నికల్లో పొత్తులు ఉండి కూడా సున్నాకో సింగిల్ డిజిట్ కో  పరిమితమవుతూ బీజేపీ చతికిలపడుతున్నది. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరో మారు భంగపాటు తప్పని వాతావరణం నెలకొని వుంది. డీఎంకే, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం  పది ప్రాంతీయ పార్టీలు ఒకవైపు, అన్నాడీఎంకే,  బీజేపీ, పీఎంకే తో సహా  తొమ్మిది  ప్రాంతీయ పార్టీలు మోహరించి తలపడుతున్న తమిళనాడు ఎన్నికలు ఒక మహా సంగ్రామాన్ని తలపిస్తున్నాయి.

డా. అయాచితం శ్రీధర్

* ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ openpage@v6velugu.com
* రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
* స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.