
- రూ1500 కోట్లు కేటాయిస్తామని హామీ
- ఏడాది దాటినా పైసా రాలే.. పనులు షురూ కాలె
- కనీసం బోటింగ్ సౌకర్యం కూడా కల్పించట్లే
సిద్దిపేట, వెలుగు: మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, అన్నపూర్ణ, బస్వాపూర్ రిజర్వాయర్లు, ఏడుపాయల వనదుర్గ ప్రాజెక్టులను కలుపుతూ ఏర్పాటు చేస్తామన్న టూరిజం సర్క్యూట్ ముందట పడడం లేదు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడాది దాటిపోయినా అమలుకు నోచుకోకవడం లేదు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవం సందర్భంగా ‘బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల షూటింగులు, డెస్టినేషన్ మ్యారేజీలకు మల్లన్నసాగర్ స్పాట్‌గా మారాలె.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను మించిన స్థాయిలో కలర్ ఫౌంటెన్స్ ఉండాలె.. మనం సింగపూర్ కు పోవుడు కాదు... సింగపూర్ నుంచే టూరిస్టులు ఇక్కడికి రావాలె’ అని సీఎం చేసిన ప్రకటన కాగితాలకే పరిమితం అయ్యింది. ఇందుకోసం రూ.1500 కోట్లు కేటాయిస్తామని చెప్పినా పైసా కూడా మంజూరు కాలేదు.
అవకాశాలు ఉన్నా..
మల్లన్న సాగర్ హైదరాబాద్‌కు కేవలం 70 కిలో మీటర్ల దూరంలోనే ఉంది. రాజీవ్ రహదారిని అనుకుని ఈ మార్గంలోనే కొండపోచమ్మ సాగర్, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, వర్గల్ సరస్వతి ఆలయాలు ఉండడంతో టూరిస్టులను ఆకర్షించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాదాపు 17 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ మధ్యలో దాదాపు 600 ఎకరాల ఐలాండ్ ఉంది. టూరిజం సర్క్యూట్ పనులు ఇక్కడి నుంచే చేపట్టేలా అధికారులు ప్లాన్ చేసినా.. నిధులు రాక అడుగు ముందుకు పడడం లేదని తెలిసింది. దీంతో పాటు రిజర్వాయర్‌లో వాటర్ స్పోర్ట్స్, చుట్టూ 8 వేల ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ఉండటంతో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి అవకాశం ఉంది. ఏడాది పోడవునా కనిష్టంగా 10 టీఎంసీల నీరు ఉంటున్నా కనీసం బోటింగ్ ఏర్పాట్లు కూడా చేయడం లేదు.
ఇక్కడ ఇలా.. అక్కడ అలా..
మల్లన్న సాగర్ రిజర్వాయర్ వద్ద ఎలాంటి పనులు చేపట్టని సర్కారు రంగనాయక సాగర్ వద్ద టూరిజం స్పాట్ పనులు మాత్రం ప్రారంభించింది. దాదాపు రూ.100 కోట్లతో రిజర్వాయర్‌లో నీటిని డెడ్ స్టోరీజీకి తెచ్చి డెస్టినేషన్ వెడ్డింగ్ సెంటర్ నిర్మాణం మొదలు పెట్టింది. దీంతో పాటు కాటేజీ నిర్మాణ పనులకు కూడా త్వరలోనే శ్రీకారం చుట్టనుంది.
16 నెలలైపాయే..
కాళేశ్వరం ప్రాజెక్టులో అతిపెద్ద రిజర్వాయర్ అయిన మల్లన్నసాగర్‌ను తొగుట మండలం తుక్కాపూర్ వద్ద 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. దీన్ని సీఎం కేసీఆర్ గత ఫిబ్రవరి 23న ప్రారంభించి.. మల్లన్నసాగర్ టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కానీ, దాదాపు 16 నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఎలాంటి కసరత్తు మొదలుపెట్టలేదు. సర్క్యూట్ పనులే కాదు రూ.100 కోట్లతో చేపట్టిన ఇరిగేషన్ కాంప్లెక్స్, రాజీవ్ రహదారి నుంచి ఫోర్ లేన్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభం కాలేదు.