ఇక వాట్సాప్‌లోనే టూరిజం టికెట్లు ! టికెట్ బుకింగ్ ఈజీ చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ

ఇక వాట్సాప్‌లోనే టూరిజం టికెట్లు ! టికెట్ బుకింగ్ ఈజీ చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ
  • టికెట్ బుకింగ్ ఈజీ చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ
  • కోటక్ మహీంద్రా బ్యాంక్ సహకారంతో చాట్‌బాట్ సేవలు
  • పర్యాటక ప్రాంతాల సమాచారమంతా ప్రత్యేక యాప్లో
  • సైబర్ ముప్పు నుంచి రక్షణకు థర్డ్ పార్టీ నిఘా

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రజలకు టూరిజం సేవలను మరింత ఈజీ చేసేందుకు పర్యాటక శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పర్యాటకులు తమ మొబైల్ నుంచే సులభంగా టికెట్లు బుక్ చేసుకునేలా 'వాట్సాప్ బుకింగ్' సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. పర్యాటక శాఖ కేటాయించిన అధికారిక వాట్సాప్ నంబర్‌కు 'హాయ్' అని మెసేజ్ పంపడం ద్వారా తెలుగు లేదా ఇంగ్లీష్ భాషల్లో చాట్ చేసే వెసులుబాటు ఉంటుంది. అనంతరం హోటల్ బుకింగ్, బోటింగ్, బస్సు ప్యాకేజీలు, ఎంట్రీ టికెట్లు వంటి విభాగాలను ఎంచుకోవచ్చు.

పర్యాటక ప్రాంతం పేరు, తేదీ, సందర్శకుల సంఖ్యను ఎంటర్ చేస్తే క్షణాల్లో టికెట్ బుక్ అవుతుంది. అంతేకాదు, ప్యాకేజీల వివరాల కోసం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానున్నది. ఇందుకోసం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ప్రతినిధులతో పర్యాటకశాఖ పలుమార్లు సంప్రదింపులు జరిపింది. ఈ చర్చలు త్వరలో కొలిక్కి వస్తే చాట్‌బాట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

సైబర్ దాడులకు చెక్!
డిజిటల్ చెల్లింపుల టైంలో పర్యాటకుల డేటా భద్రతకు అధికారులు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు అత్యాధునిక ఎన్‌క్రిప్షన్ విధానాన్ని అమలు చేయనున్నారు. డేటా భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక థర్డ్ పార్టీ సంస్థను నియమించనున్నారు. అలాగే, పర్యాటకులు ఫేక్ లింకుల బారిన పడకుండా ఉండేందుకు వాట్సాప్‌లో 'గ్రీన్ టిక్' ఉన్న అధికారిక ఖాతా ద్వారానే సేవలు అందించనున్నారు.వాట్సాప్‌తో పాటు పర్యాటక శాఖ ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను కూడా రూపొందిస్తోంది. ఇందులో రాష్ట్రంలోని చారిత్రక ప్రదేశాలు, జలపాతాల విశిష్టత, హరిత హోటళ్లలో గదుల లభ్యత, ప్యాకేజీ టూర్ల సమయాలు వంటి పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.

పర్యాటకులు ఎక్కడి నుంచైనా వీటిని పరిశీలించి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు. దీనిద్వారా పర్యాటక రంగంలో పారదర్శకత పెరగడంతోపాటు సందర్శకులకు మెరుగైన సేవలందుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా' యాప్‌ను, కేరళ ప్రభుత్వం 'కేరళ టూరిజం' యాప్‌ను నిర్వహిస్తున్నాయి. ఏపీ సర్కార్ కూడా పర్యాటకుల కోసం ఆంధ్రా టాక్సీ యాప్​ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ  తరహాలోనే తెలంగాణ యాప్ కూడా పర్యాటకులకు గైడ్‌లా పని చేయనుంది.

కేరళలో వాట్సాప్ సేవలు
దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు వాట్సాప్‌ ద్వారా టూరిజం సేవలను విజయవంతంగా అమలు చేస్తున్నాయి. కేరళ ప్రభుత్వం 'మాయ' పేరుతో వాట్సాప్ చాట్‌బాట్‌ను నిర్వహిస్తోంది. పర్యాటకులు 75105 12345 నంబరుకు హాయ్​అని మెసేజ్ చేయడం ద్వారా పర్యాటక ప్రాంతాల సమాచారం, వాతావరణ అప్‌డేట్స్, బ్రోచర్లు, ఈ-టికెటింగ్ సేవలను పొందవచ్చు. పర్యాటకులకు 24/7 అందుబాటులో ఉంటూ  గైడ్‌లా పనిచేస్తోంది. 

ఇదే తరహా సేవలను పర్యాటకుల కోసం తెలంగాణలో తీసుకొచ్చేందుకు పర్యాటకశాఖ పనిచేస్తోంది. వీలైనతంగా త్వరగా ఈ సేవలను పర్యాటకుల చెంతకు చేర్చాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించడంతో టూరిజం ఎండీ గౌతమి ఆ దిశగా  పనులను వేగవంతం చేశారు. ఆధునిక హంగులతో  టూరిజం ఆన్ లైన్ సేవలు త్వరలోనే రాష్ట్రంలో కూడా రానున్నాయి.