గోవాలో తగ్గుతున్న టూరిస్టులు..

గోవాలో తగ్గుతున్న టూరిస్టులు..

గోవాకు టూరిజం బెంగ పట్టుకుంది. టూరిస్టుల రాక తగ్గిపోతుండటంతో బిజినెస్‌‌ దెబ్బతింటోంది. పర్యాటకంపై ఆధారపడిన వాళ్లంతా ఆందోళన చెందుతున్నారు. రెండు లోక్‌‌సభ సీట్లున్న గోవాలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి టూరిజం పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రం కాబోతోంది. రోజురోజుకు తగ్గిపోతున్న టూరిస్టులు, పేరుకుపోతున్నసమస్యలే పార్టీల ఎజెండాలుగా మారుతున్నాయి.గతేడాది విదేశీ, స్వదేశీ పర్యాటకుల్లో భారీ తగ్గుదల నమోదైంది. సుమారు 60 లక్షల మంది పర్యాటకులు తగ్గిపోయారని టూరిజం డిపార్ట్‌‌మెంట్‌‌ అంచనావేస్తోంది. ఈమధ్య గోవా టూరిజం మంత్రి మనోహర్‌‌ అజ్‌‌వాంకర్‌‌ రాష్ట్రంలోని టూరిజం సంస్థల ప్రతినిధులతో జరిపిన మీటింగ్‌‌లో ఇదే అంశంపై చర్చజరిగింది. గతంలో పోలిస్తే ఆదాయం తగ్గిపోయిందని వాళ్లంతా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పర్యాటకుల్లో40 శాతం వరకు తగ్గుదల కనిపిస్తోందని, ఇది కుదురు కోవడం కష్టమేనని పర్యాటక, టూరిజం అసోసియేషన్ ఆఫ్ గోవా రాష్ట్ర ప్రెసిడెంట్‌‌ సవియో మెసియా పేర్కొన్నారు. టూరిస్టుల తగ్గుదలపై ప్రభుత్వం వద్ద ఎలాంటి అధికారిక లెక్కలు లేవన్నారు. గోవాలోని హోటళ్లన్నీ ప్రస్తుతం మీటింగ్‌‌లు, సదస్సులు, ఎగ్జిబిషన్లకు మాత్రమే పరిమి తమయ్యాయని, సాధారణ టూరిస్టులు రావడం లేదని అంటున్నారు.

ఓట్లకొస్తే నిలదీస్తం
గోవాలో టూరిజాన్ని కేంద్రం పూర్తిగా మరిచిపోయిందని, ఓట్లడిగేందుకు వచ్చినప్పుడు సమస్యలపై బీజేపీ అభ్యర్థులను నిలదీస్తామని, కచ్చితమైన హామీ తీసుకుంటామని సంప్రదాయ షాక్ ఓనర్స్అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌ మానుల్‌‌ కార్డోసో అన్నారు. టూరిజం గతంలో ఎప్పుడూ ఎన్నికల ఎజెండా కాలేదని, ఈసారి దీనిపైనే ఎన్నికలు జరుగుతాయని నార్త్‌‌ గోవా ట్యాక్సీ ఓనర్స్‌‌ అసోసియేషన్‌‌  జనరల్‌‌ సెక్రటరీ వినాయక్‌‌ నానోష్కర్‌‌ చెప్పారు. గోవాలోని పర్యాటక సమస్యలపై ఎన్నోసార్లు విన్నవించామని, అయినా పరిష్కారం దొరకలేదని ఆయనతెలిపారు.