కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు ..మూడు నెలల్లో 61 మందికి డెంగ్యూ

కామారెడ్డి జిల్లాలో విజృంభిస్తున్న విష జ్వరాలు ..మూడు నెలల్లో 61 మందికి డెంగ్యూ

ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య శాఖ 

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో 61 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యాధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. జ్వర పీడితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెల్త్​క్యాంపులు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. వాతావరణ పరిస్థితులు, పరిసరాల అపరిశుభ్రతతో దోమలు వ్యాప్తి చెంది జ్వరాలు వస్తున్నట్లు వైద్యాధికారులు పేర్కొంటున్నారు.  

5 పీహెచ్​సీల పరిధిలో కేసులు అధికం.. 

మాచారెడ్డి, అన్నారం, కామారెడ్డి ఆర్బన్​, దేవునిపల్లి, లింగంపేట పీహెచ్​సీల పరిధిలో డెంగ్యూ కేసులు అధికంగా నమోదయ్యాయి. పలు తండాలు, గ్రామాల్లో పారిశుధ్యం లోపించడం వల్ల జ్వరాలు వస్తున్నాయి. ఏఎన్​ఎంలు, ఆశ వర్కర్లు ఇంటింటి జ్వర సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లాలో రోజుకు సుమారు 100 మందికి వైరల్ ఫీవర్​వస్తున్నట్లు గుర్తించారు. 

కామారెడ్డి పట్టణంలోనూ పలువురు జ్వరాల బారిన పడుతుండడంతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవల  పాల్వంచ మండలం భవానిపేటలో సుమారు ఆరుగురికి డెంగ్యూ  నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. తాడ్వాయి మండలం దేమికలాన్​లో గత నెలలో వాంతులు, విరేచనాలతో ఇద్దరు చనిపోగా, మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. జిల్లా కేంద్రంలో పారిశుధ్య లోపం అధికంగా ఉంది.

హెల్త్​క్యాంపుల ఏర్పాటు.. 

ఆయా గ్రామాల్లో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్​క్యాంపులు నిర్వహిస్తున్నారు.  ఫీవర్ సర్వేతో రోగులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఇండ్ల మధ్య మురుగు నీరు నిల్వ ఉండకుండా చూడాలని, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, వేడి పదార్థాలు తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.   

హైరిస్క్​ ఏరియాల గుర్తింపు..

జిల్లాలోని మాచారెడ్డి, అన్నారం, కామారెడ్డి ఆర్బన్​, దేవునిపల్లి, లింగంపేట పీహెచ్​సీల పరిధులను హైరిస్క్​ ఏరియాలుగా గుర్తించాం. గ్రామాల్లో ఫీవర్ సర్వే నిర్వహించి హెల్త్​క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం.  జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నాం.  - డాక్టర్​ చంద్రశేఖర్, డీఎంహెచ్​వో -కామారెడ్డి