
న్యూఢిల్లీ: తెలంగాణలో కులగణన చేసి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లులు ఆమోదించామని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. కుల గణన చేసి దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించి పంపిన బీసీ కోటా బిల్లులను ప్రధాని మోడీ నాలుగు నెలలుగా తొక్కిపెట్టారని విమర్శించారు. బీసీ కోటా బిల్లులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే రాహుల్ గాంధీకి క్రెడిట్ వస్తుందని ప్రధాని మోడీ భయమని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో టీపీసీసీ చేపట్టిన బీసీ మహాధర్నా చూసైనా కేంద్రంలోని మోడీ సర్కార్ కు కనువిప్పు కలగాలని.. మోడీ తల్చుకుంటే సాయంత్రానికే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం (ఆగస్ట్ 6) ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. బీసీ కోటా బిల్లు తేవటం చారిత్రాత్మకమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్న మొనగాడు సీఎం రేవంత్ రెడ్డి అని.. ఆయన చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు. బీసీ కోటా బిల్లుతో మోడీ పరేషాన్లో ఉన్నారని అన్నారు. ఇన్నాళ్లు బీసీలకు రిజర్వేషన్లు అడిగితే ఏ లెక్కన అడుగుతున్నారని అన్నారు. ఇప్పుడు కుల గణన చేసి ఆ లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని అడుగుతున్నామన్నారు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం తెలంగాణలో కులగణన చేసి అసెంబ్లీలో ఆమోదించామని.. ఇప్పుడు దేశంలోని బీసీలంతా తెలంగాణ వైపు.. రేవంత్ వైపు చూస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ ఎక్కడ మాట్లాడినా.. తెలంగాణ వైపు చూడండి.. రేవంత్ వైపు చూడండి అని చెప్తున్నారని అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ కోటా బిల్లులను నాలుగు మాసాలుగా కేంద్ర ప్రభుత్వం తొక్కిపెట్టిందని ఫైర్ అయ్యారు. మోడీకి బీసీల బాధ తెలియాలనే ఢిల్లీలో మహాధర్నా చేపట్టామని తెలిపారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎప్పుడైనా పని చేసి గెలిచారా..? ఎప్పుడూ రాముడు, హనుమంతుడు పేరు చెప్పి గెలవాలని చూస్తారని విమర్శించారు. మేము కూడా దేవుళ్లను పూజిస్తాం కానీ దేవుని పేరుతో రాజకీయం చేయం ఓట్లు అడగమన్నారు. బీజేపీ ముస్లింల పేరు చెప్పి బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చూస్తోంది. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే ఇలాంటి సొల్లు కబుర్లు చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీసీ బీసీ అని ఓట్లేయించుకున్న బండి సంజయ్.. కిషన్ రెడ్డి మాట వింటున్నాడని విమర్శించారు. బీసీలకు మద్దతుగా రెడ్డిలు, బ్రాహ్మణులు, ఎస్సీలు.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. కానీ తెలంగాణ బీజేపీ బీసీ నేతలకు ఎందుకు ముందుకు రావడం లేదని నిలదీశారు. ఢిల్లీలో కాంగ్రెస్ మహాధర్నా చూసైనా కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లులకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. మోడీ సర్కార్ బిల్లులకు ఆమోదం తెలిపే వరకు మా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.