CM రేవంత్‎తో పాటు నా ఫోన్ ట్యాప్.. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి: TPCC చీఫ్

CM రేవంత్‎తో పాటు నా ఫోన్ ట్యాప్.. కేటీఆర్ సిగ్గుతో తల దించుకోవాలి: TPCC చీఫ్

హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని, ఎప్పటికప్పుడూ మమ్మల్ని పర్యవేక్షించారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మంగళవారం (జూన్ 17) మహేష్ గౌడ్ పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో సాక్షిగా ఆయన పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మీ ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని.. మీ నుంచి కొంత సమాచారం కావాలని కోరడంతో సిట్ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. 

బీఆర్ఎస్ హయాంలో చట్టానికి వ్యతిరేకంగా అనేకమంది ఫోన్లు టాప్ చేశారని, ప్రజాస్వామ్యంలో రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని విమర్శించారు. ఇలాంటి చర్యకు పాల్పడ్డ నాటి సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేశారని దుయ్యబట్టారు. మేము మాత్రమే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే చెడు ఆలోచనతో ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. 2018లో మేము ఓడిపోవడానికి కారణం కూడా మా నాయకుల ఫోన్లు టాప్ చేయడం వల్లేనని అన్నారు.

 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లు టాపింగ్‎లో ఉన్నాయని.. సిట్ జాబితాలో 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు ఉన్నాయని తెలిపారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్‎తో పాటు అనేకమంది ఫోన్లు ట్యాప్ అయినట్లు తెలుస్తోందన్నారు. ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సిన అధికారులు.. రాజకీయ నాయకులకు ఏ విధంగా ఒత్తాసు పలికారో ఈ ఒక్క ఘటన ద్వారా అర్థమవుతోందన్నారు. 

►ALSO READ | రియల్ ఎస్టేట్ రిటర్న్స్‌లో హైదరాబాద్ టాప్ : నాలుగేళ్లలోనే పెట్టుబడి డబుల్..!

వ్యక్తిగత భద్రత అనేది ప్రాథమిక హక్కు అని.. బీఆర్ఎస్ నేతలు దానిని కాలరాశారని ఫైర్ అయ్యారు. రిటైర్డ్ అయిన ప్రభాకర్ రావును దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇంటెలిజెన్స్ చీఫ్‎గా నియమించి ఇలాంటి దుశ్చర్య పాల్పడడం సిగ్గుచేటని విమర్శించారు. నక్సలైట్లకు సింపతైజర్ గా ఉన్నానని ఆరోపిస్తూ నా ఫోన్ ట్యాప్ చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తూ ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేయడం దుర్మార్గమైన చర్య అని.. ఇందుకు కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. 

రాజకీయ లబ్ది కోసం ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేసిన మీరు శిక్షకు అర్హులని.. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇలాంటి దిగజారుడు పనికి ఒడిగట్టిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూడా శిక్ష పడాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ- సజావుగా జరిపి.. నిందితులు రాజకీయ నాయకులైన, అధికారులైన, కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.

 రాజకీయ అవసరాల కోసం జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేయడం హేయమైన చర్య అని అన్నారు. ఒక్క కాంగ్రెస్ నేతలవే కాకుండా- టీడీపీ, బీజేపీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఉద్దేశంతో నా ఫోన్ ట్యాప్ చేసినట్లు ప్రభాకర్ రావు పోలీసులకు చెప్పాడట అని అన్నారు.