ఆర్మీ అభ్యర్థులకు అండగా కాంగ్రెస్ పోరాటం

ఆర్మీ అభ్యర్థులకు అండగా కాంగ్రెస్ పోరాటం

ప్రధాని నరేంద్ర మోడీ  అవగాహనా రాహిత్యం వల్లే సికింద్రాబాద్ ఘటన జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. ఈ ఘటనలో గాయపడ్డ  ఆర్మీ అభ్యర్థులను కలిసి, వాళ్ల డిమాండ్లు అడిగి తెలుసుకున్నానని తెలిపారు. శనివారం ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. ఆర్మీ అభ్యర్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరానన్నారు. అవసరమైతే అపోలో లాంటి హాస్పిటల్ కు తీసుకెళ్లాలని సూచించినట్లు పేర్కొన్నారు. వారికి అవసరమయ్యే ఖర్చుకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని రేవంత్ చెప్పారు.  విద్యార్థులపై పెట్టిన కేసులపై కాంగ్రెస్ పోరాటం చేస్తదని స్పష్టం చేశారు. వారికి కావాల్సిన ఆర్థికసాయాన్ని కాంగ్రెస్ పార్టీ  అందిస్తుందని, న్యాయవాదులను కూడా పెడుతుందని వెల్లడించారు.

ఆర్మీ లో అవుట్ సోర్సింగ్ విధానమేంటి ? 

అమెరికా తరహా ఆర్మీ విధానాన్ని భారత్ లో అమలు చేయాలని మోడీ అనుకోవడం బాధాకరమన్నారు. ఆర్మీ లో అవుట్ సోర్సింగ్ విధానమేంటని రేవంత్ ప్రశ్నించారు. ఆర్మీకి కొత్తగా ఎంపికయ్యే వారిని 4 ఏళ్ల తర్వాత బయటికి పంపాలనే నిర్ణయమే ఈ ఘటనకు కారణమైందని అభిప్రాయపడ్డారు. ఆర్మీ నియామక ప్రక్రియ సగం దాకా పూర్తి చేసుకున్న ఎంతోమంది అభ్యర్థులు.. కేంద్రం ప్రకటనతో ఆవేదనలో పడ్డారని తెలిపారు. వారికి రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలతో సంబంధం లేదన్నారు. ఆర్మీ అభ్యర్థులు శాంతియుతంగా నిరసన తెలపాలని భావించినప్పటికీ.. లాఠీ ఛార్జి, ఫైర్ చేయడం వల్ల ఒక విద్యార్ధి చనిపోయాడని చెప్పారు. అమెరికా విధానం ఫాలో అవుతున్న మోడీ..  ప్రధాని పదవీ కాలాన్ని కూడా నాలుగేళ్లకు కుదించుకోవాలని రేవంత్ సూచించారు.  అమెరికాతో భారత్ కు పోలిక ఎక్కడిదని ఆయన వ్యాఖ్యానించారు. రైతు చట్టాల రద్దు కోసం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎలా పోరాటం చేశామో.. జవాన్ ల కోసం అదే రీతిలో ఫైట్ చేస్తామని హెచ్చరించారు. దీనిపై డిఫెన్స్ స్టాండింగ్ కమిటీలో కాంగ్రెస్ పార్టీ  చర్చిస్తుందన్నారు.  ‘‘నన్ను ఆపాలనుకుంటే.. ఎలా వెళ్లాలో నాకు తెలుసు’’ అని రేవంత్ తెలిపారు.