
మునుగోడు నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్ఎస్ లు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. నాయకులను నిస్సిగ్గుగా కొనుగోలు చేసి అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎన్నడూ, ఎక్కడా లేనివిధంగా రాజకీయ దుర్మార్గానికి పాల్పడుతున్నారని చెప్పారు. టీఆర్ఎస్ దుర్మార్గాలు శ్రుతి మించిపోయాయన్న రేవంత్.. వాటిని ఎదుర్కొనేందుకు ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ఓటర్లకు వందనం
ప్రజాస్వామ్యానికి వందనం అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా తనతో పాటు వెయ్యి మంది నాయకులు ఒక్కొక్కరు వంద మంది ఓటర్లకు వందనం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని కోరుతారని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ లు వెయ్యి కోట్లు ఖర్చు చేసి మునుగోడు ఉప ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతుంటే.. కాంగ్రెస్ నాయకులు లక్ష మందికి వందనం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతారని అన్నారు. తాను మునుగోడులోని తెలంగాణ సమరయోధుల కుటుంబాలను కలిసి వారికి వందనాలు చేయనున్నట్లు ప్రకటించారు.
రేపు మునుగోడుకు రేవంత్
మరోవైపు శనివారం రాజీవ్ గాంధీ జయంతి నేపథ్యంలో జూమ్ మీటింగ్ ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలో మన మునుగోడు, మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉదయం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పార్టీ జెండా ఎగరేసి, రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. పొర్లుతండా గ్రామంలో రేపు ఉదయం రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ప్రకటించిన రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం12 గంటలకు చౌటుప్పల్ లో ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు చెప్పారు. నాయకులు, కార్యకర్తలు రాజీవ్ జయంతి కార్యక్రమం పూర్తైన అనంతరం చౌటుప్పల్ కు రావాలని విజ్ఞప్తి చేశారు.