వాస్తవాలు బయటకొస్తాయనే సీఎల్పీ బృందాన్ని అడ్డుకుంటోంది

వాస్తవాలు బయటకొస్తాయనే సీఎల్పీ బృందాన్ని అడ్డుకుంటోంది

కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన సీఎల్పీ బృందాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలు బయటికి వస్తాయనే సీఎల్పీ బృందం పర్యటనను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. డిజైన్ లోపమే అన్నారం పంప్ హౌస్కు శాపంగా మారిందని..దాన్ని ఫలితంగా వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఇంజనీరింగ్ నిపుణలు చెబుతున్నారని అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రభుత్వం మాత్రం అత్యంత బాధ్యతరాహిత్యంగా కేవలం 2.5 కోట్ల నష్టం మాత్రమే జరిగిందని..ఆ నష్టాన్ని కూడా కాంట్రాక్ట్ సంస్థే భరిస్తుందని నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ తో అబద్ధాలను ప్రచారం చేయించిందని మండిపడ్డారు.

ఇవన్నీ వాస్తవాలు బయటపడతాయనే ప్రభుత్వం సీఎల్పీ బృందాన్ని అడ్డుకుంటోందని రేవంత్ ఆరోపించారు. ప్రభుత్వంతో సమానంగా ప్రజలకు వాస్తవాలను  వివరించాల్సిన బాధ్యత విపక్షాల మీద కూడా ఉంటుందని.. ప్రాజెక్టులను సందర్శించకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించడం నిరంకుశత్వానికి నిదర్శనమన్నారు. నిజంగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఏంనష్టం జరగకుంటే దాన్ని చూపించడానికి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ప్రాజెక్టుల సందర్శనకు ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.