
శామీర్ పేట, వెలుగు: రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయి రేకుల షెడ్డులో ఉంటున్న మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్‌కు చెందిన ఎల్లవ్వకు ఇచ్చిన హామీని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నెరవేర్చారు. గురువారం స్థానిక కాంగ్రెస్లీడర్లు ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారు. ముగ్గు పోసి.. స్థలం చదును చేసే పనులు మొదలుపెట్టారు. మేడ్చల్ -మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్ లో రోడ్డు విస్తరణలో కుమ్మరి ఎల్లవ్వ ఇంటిని అధికారులు కూల్చేశారు. దీంతో ఆమె రేకుల షెడ్డులో తలదాచుకుంటోంది. ఇటీవల రచ్చబండకు వచ్చిన రేవంత్ రెడ్డి ఆమె దీనస్థితిని చూసి చలించిపోయారు. ఎల్లవ్వకు ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ సొంత ఖర్చులతో ఇంటిని కట్టిస్తుందని భరోసా కల్పించారు. అధికారులెవరూ స్పందించకపోవడంతో టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్, స్థానిక జడ్పీటీసీ , మేడ్చల్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ఓ కమిటీ వేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో హరివర్ధన్ రెడ్డి తన సొంత ఖర్చులతో శుక్రవారం కుమ్మరి ఎల్లవ్వ కొడుకు, కోడలైన కవిత, శ్రీనివాస్ లతో పూజా కార్యక్రమం నిర్వహించి కొత్త ఇంటికి శంకుస్థాపన చేశారు. ఇంటిని తొందరలోనే పూర్తి చేస్తామని, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డిని, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎల్లవ్వ ఇంటికి ఆహ్వానించి గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. తెలంగాణ సర్పంచుల ఫోరం అధికార ప్రతినిధి సురేందర్ , తూముకుంట మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, జైపాల్ రెడ్డి, మూడు చింతలపల్లి మండల లీడర్లు దోసకాయల వెంకటేశ్, దామోదర్ రెడ్డి, సంతోష్, ఆంజనేయులు, రవీందర్ , మేకల మహేందర్, పాల్గొన్నారు.