కేసీఆర్​.. నీకు దమ్ముంటే.. గజ్వేల్​లో పోటీ చెయ్‌‌ : రేవంత్‌‌ రెడ్డి

కేసీఆర్​.. నీకు దమ్ముంటే..  గజ్వేల్​లో పోటీ చెయ్‌‌ : రేవంత్‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌ఎస్ చెబుతున్న అభివృద్ధి నిజమే అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించాలని పీసీసీ చీఫ్ రేవంత్‌‌రెడ్డి సవాల్ విసిరారు. గజ్వేల్ నుంచి పోటీ చేసి తన దమ్మేంటో నిరూపించుకోవాలన్నారు. ఓటమి భయంతో ఇతర నియోజవర్గాల నుంచి పోటీ చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. శనివారం రేవంత్ గాంధీభవన్‌‌లో మీడియాతో మాట్లాడారు. ఉచిత కరెంట్‌‌ హామీని 1999 నాటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టామని, 2004లో అధికారంలోకి వచ్చాక ఆ హామీని కాంగ్రెస్ నిలుపుకుందన్నారు. ఇప్పుడు గెలిస్తే కూడా 24 గంటల కరెంట్ రైతులకు ఇస్తామన్నారు. 24 గంటల కరెంట్ అని చెప్తూ.. కేసీఆర్ 12 గంటలు కూడా ఇవ్వడం లేదన్నారు. సబ్ స్టేషన్ల దగ్గర గ్రామ సభలు పెట్టి 24 గంటల కరెంట్ ఇస్తున్నట్టు నిరూపించుకోవాలని, లేదం టే ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని సవాల్ చేశారు. ఈ సవాల్‌‌ను స్వీకరించే దమ్ము బీఆర్‌‌‌‌ఎస్ నేతలకు ఉన్నదా అని రేవంత్ ప్రశ్నించారు.

అప్పటి కరెంట్​ పాలసీ చంద్రబాబు, కేసీఆర్​లదే

ఉచిత విద్యుత్​పై బీఆర్ఎస్ నేతల అరుపుల్లో ఓటమి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయని రేవంత్ అన్నారు. మంత్రి హరీశ్, మండలి చైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి కాం గ్రెస్ పార్టీపై, తనపై చేసిన ఆరోపణలు, విమర్శలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు. “రాష్ట్రంలో 3,500 సబ్ స్టేషన్లు ఉన్నాయి. మా ఎంపీ వెంకట్‌‌రెడ్డి లాగ్​బుక్​లు చూపించి 24గంటల కరెంటు రావడం లేదని నిరూపించారు. సబ్ స్టేషన్ల దగ్గర గ్రామ సభలు పెడదాం, రైతులతో చర్చ పెడదాం. దీనికి మీరు సిద్ధమా”అని చాలెంజ్​ ​చేశారు. 1999లోనే వైఎస్సార్​ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నపుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని పెట్టామ ని గుర్తుచేశారు. ‘‘1999లో అధికారంలోకి రాలే దు కాబట్టి అప్పుడు ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోయాం. అప్పట్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ కరెంటు చార్జీలు పెంచింది. దీని మీద కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోరాడారు. చలో అసెంబ్లీ ఆందోళన సందర్భంగా జరిగిన బషీర్ బాగ్ కాల్పుల్లో ముగ్గురు రైతులు మరణించారు. చంద్రబాబు హయాంలో కేసీఆర్ టీడీపీ హెచ్ఆర్డీ విభాగం చైర్మన్​గా ఉన్నారు. హెచ్ఆర్డీ విభాగం రూపొందించే పాలసీలను ప్రభుత్వంలో అమలు చేశారు. అప్పుడు పోచారం మంత్రిగా ఉన్నారు. గుత్తా పార్టీలో కీలకంగా ఉన్నారు. వీళ్లంతా చంద్రబాబుతో కలిసి విద్యుత్ పాలసీని తయారు చేశారు. అప్పుడు ప్రజలను కాల్చి చంపిన పాపంలో కేసీఆర్‌‌‌‌ది కీలక పాత్ర’’ అని రేవంత్ ఆరోపించారు.

టీడీపీ, కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో బతికారు

తాను ఇండిపెండెంట్‌‌గా ఎమ్మెల్సీగా గెలుపొంది, ఆ తర్వాత 2007లో టీడీపీలో చేరానని రేవంత్ గుర్తు చేశారు. దానికి ఏడేండ్ల ముంగట జరిగిన బషీర్‌‌‌‌బాగ్ కాల్పులతో తనకు సంబంధం ఏంటి అని రేవంత్ ప్రశ్నించారు. ‘‘అనాటి కాల్పులకు నేను కారణం అవుతానని హరీశ్​రావు ఎట్లంటరు? ఆయనకు మెదడు మోకాలిలో ఉంది. వార్డ్ మెంబర్‌‌గా గెలవకముందే కాంగ్రెస్ ఆయన్ను మంత్రిని చేసింది. తెలంగాణ కోసమే రాజీనామా చేశానని చెప్పుకున్న కేసీఆర్..2009లో మళ్లీ చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? మీరు పరాన్నజీవులు.. ఒకవైపు టీడీపీ.. మరో వైపు కాంగ్రెస్ దాయాదాక్షిణ్యాలతో బతికారు. ఆ పార్టీలతో బతికి ఆ పార్టీలనే తిట్టే నీచ సంస్కృతి మీది” అని రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  

వాళ్లను బర్తరఫ్ చేయాలె

పోచారం, గుత్తాకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అని రేవంత్ దుయ్యబట్టారు. ‘‘స్పీకర్, చైర్మన్ పదవుల్లో ఉన్న గుత్తా, పోచారం రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ ప్రత్యక్ష రాజకీయ నాయకుల లెక్క ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్ బూట్లు నాకుతున్నారు. పోచారం కొడుకులు కంకర నుంచి ఇసుక వ్యాపారం దాకా చేయని దందా లేదు. కొడుకుల కోసమే పోచారం దిగజారి ప్రవరిస్తున్నారు. పంచాయతీకి కూడా పనికిరాని గుత్తా సుఖేందర్ రెడ్డిని రెండు సార్లు కాంగ్రెస్ ఎంపీ చేసింది. మంత్రి పదవి మీద ఆశతో గుత్తా బీఆర్ఎస్ లో చేరిండు. ఇప్పుడు గుత్తా తన కొడుకు టికెట్ కోసం దిగజారి ప్రవర్తిస్తున్నారు. వారిని గవర్నర్ వెంటనే పదవుల నుంచి బర్తరఫ్ చేయాలి అని” రేవంత్ డిమాండ్ చేశారు.

ఆందోళన ఆపకపోతే సస్పెండ్ చేస్తా..

యాదగిరిగుట్ట, వెలుగు: గాంధీభవన్ ఎదుట శనివారం ఆందోళన చేపట్టిన యాదాద్రి జిల్లా తుర్క పల్లి మండల కాంగ్రెస్ నేతలపై పీసీసీ చీఫ్​ రేవంత్ ​రెడ్డి ఫైర్​ అయ్యారు. ఆందోళన ఆపకపోతే పార్టీ నుంచి సస్పెండ్​ చేస్తానని హెచ్చరించారు. తుర్కపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పీసీసీ మీడియా కో ఆర్డినేటర్ బోరెడ్డి అయోధ్య రెడ్డి భార్య జ్యోతి నియామకాన్ని నిరసిస్తూ.. ఆ మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం గాంధీభవన్ ఎదుట నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్​చార్జ్​ బీర్ల ఐలయ్యకు ఫోన్ చేశారు. గాంధీభవన్ ఎదుట ఈ లొల్లేంటి? అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఒక్క మండలానికి ఇతర వ్యక్తికి అధ్యక్ష పదవి ఇస్తే ఇంత రాద్ధాంతం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆందోళన విరమింపజేయాలని, లేకపోతే ఆ మండల నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. దీంతో ఆందోళన చేస్తున్న నాయకులకు బీర్ల ఐలయ్య ఫోన్ చేసి చెప్పడంతో నిరసన విరమించారు. అనంతరం.. వారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఆయన ఇంటికి వెళ్లి కలిశారు. అయితే, మొన్నటి వరకు ఉన్న శంకర్ నాయకే ఇకముందు కూడా అధ్యక్షుడిగా కొనసాగుతారని కోమటిరెడ్డి హామీ ఇచ్చారని వారు తెలిపారు.