ధరణి ఫైల్స్ రిలీజ్ చేస్తం : రేవంత్ రెడ్డి

ధరణి ఫైల్స్ రిలీజ్ చేస్తం : రేవంత్ రెడ్డి

ధరణి ఫైల్స్ రిలీజ్ చేస్తం
భూదందాను ధారావాహికగా వివరిస్త
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్త
తెలంగాణలో అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు
తెరవెనుక చిన్నదొర ఫ్రెండ్ గాదె శ్రీధర్ రాజు
క్వాంటెల్లా సంస్థ పేరిట కార్యకలాపాలు
విదేశీయుల చేతిలో మన ఆస్తుల చిట్టా
ధరణి రద్దు చేస్తమంటే కేసీఆర్, కేటీఆర్ ఏడుస్తుండ్రు
వాళ్ల బండారం బయపడుతుందని భయం
టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి విమర్శలు

హైదరాబాద్ : త్వరలోనే ధరణి ఫైల్స్ రిలీజ్ చేస్తామని టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ భూ దందాను సీరియల్ గా చూపిస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్టు పై ఎలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారో.. ధరణి అక్రమాలపై తాము అలాగే ఇస్తామని అన్నారు. ధరణి పోర్టల్ ను పెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థ నడుపుతున్నట్టు కనిపిస్తున్నా.. దాని వెనుక ఐఎల్ అండ్ ఎఫ్​ ఎస్ అనే కంపెనీ ఉందన్నారు. ఇదో డిఫాల్టర్ కంపెనీ అని రేవంత్ పునరుద్ఘాటించారు. ఫిలిపిన్స్ కంపెనీ వెనుక సింగపూర్ సంస్థలు, వాటి వెనుక అమెరికన్ కంపెనీలు ఉన్నాయని, వాటి వెనుక ఇండియన్ సంస్థలు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఈ సంస్థల్లో బ్రిటీష్ ఐ ల్యాండ్ కంపెనీల వాటాలున్నాయని చెప్పారు. ప్రస్తుతం మన ఆధార్, పాన్, ఆస్తుల వివరాలన్నీ విదేశీ కంపెనీల చేతుల్లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో ఏదైనా సంస్థ వ్యాపారం చేస్తే వ్యవహారాలకు సంబంధించిన చివరి వివరాలు భారత ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుందని, ధరణి పోర్టల్ నడుపుతున్న కంపెనీలు వివరాలు ఇవ్వడం లేదన్నారు. 

కిషన్ రెడ్డీ.. నిగ్గు తేల్చండి

ధరణి పోర్టల్ సంస్థలో పెట్టుబడి దారులెవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగపురం కిషన్ రెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కిషన్ రెడ్డికి తాను విసురుతున్న మొదటి సవాల్ అని పేర్కొన్నారు. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ధరణి కొనసాగిస్తామని చెప్పారని, ఇప్పుడు కిషన్ రెడ్డి తన స్టాండ్ ఏమిటో చెప్పాలన్నారు. కిషన్ రెడ్డి అంటేనే.. కిషన్ చంద్రశేఖర్ రెడ్డి అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు

ధరణి పోర్టల్ వచ్చాక లక్షలాది ఎకరాల ప్రభుత్వ భూములు బదిలీ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి దాటాక పీవోబీ(ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్)లో ఉన్న భూములు అన్ లాక్ అవుతున్నాయని, ఆ తర్వాత బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని ఆరోపించారు. నాలుగైదు ట్రాన్సాక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ పెద్దల అనుయాయులకు చేరుతున్నాయని తెలిపారు. గాదె శ్రీధర్ రాజు.. అలియాస్ శ్రీధర్ రాజు అనే వ్యక్తి చేతిలో ప్రస్తుతం ధరణి పోర్టల్ ఉన్నదని రేవంత్ తెలిపారు. 

ప్రభుత్వానిదే బాధ్యత

శంకర్ హిల్స్ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను ప్రొహిబిషన్ జాబితా నుంచి తీసేసి రాత్రికి రాత్రి పట్టాలు పుట్టించారని ఆరోపించారు. గజ్వేల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన 1500 ఎకరాల భూమిని సర్కారు లాక్కొని అమూల్ డెయిరీకి అప్పగించిందని అన్నారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లా సింగారంలో 1‌‌022 ఎకరాల ఎండోమెంట్ భూములను పట్టాలు మార్చి ఫార్మా కంపెనీకి అప్పగిస్తే హైకోర్టు స్టే ఇచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వీటిన్నింటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 

తండ్రీ కొడుకులు ఏడుస్తుండ్రు

ధరణి పోర్టల్ రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత సీఎం కేసీఆర్, కేటీఆర్ ఒకటే ఏడుస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అట్లా ఏడుస్తూనే వంద సీట్లు గెలుస్తమని బింకం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. ‘గెలిచేది వారే అయితే ఎందుకు ఏడ్వాలి.. వచ్చేది మీ ప్రభుత్వమే అయితే ధరణిని మేం రద్దు చేయలేం కదా’అని అన్నారు. వాళ్ల వ్యాఖ్యలు.. కాంగ్రెస్ గెలువబోతున్నదనే వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయని చెప్పారు. సమావేశంలో ఏఐసీసీ నేత సంపత్ కుమార్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోదండరెడ్డి తదితరులున్నారు. అనంతరం కాంగ్రెస్ భూమి డిక్లరేషన్ బ్రోచర్ ను నేతలు ఆవిష్కరించారు.