ఒక్క ఆడపిల్లను ఓడించేందుకు ఇంత మందా? : రేవంత్

ఒక్క ఆడపిల్లను ఓడించేందుకు ఇంత మందా? : రేవంత్

సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్నచూపని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ లో ఒక్క మహిళను కూడా మంత్రి వర్గంలోకి తీసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న మునుగోడు ఆడబిడ్డ పాల్వాయి స్రవంతిని గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  

‘‘ మునుగోడులో కాంగ్రెస్ కార్యకర్తలను ఎవరైనా భయపెట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోం.. వెంబడి పడి తరమాల్సి వస్తది’’ అని హెచ్చరించారు.  అమ్ముడుపోయిన సన్నాసులకు గుణపాఠం చెప్పాలన్నారు. ‘ టీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్ , హరీష్ రావు ఒక్కొక్కరు ఒక్కో ఊరు  పంచుకుంటున్నారు. బీజేపీ వైపు ఢిల్లీ నుంచి  పెద్ద పెద్దోళ్ళు దిగిండ్రు. ఒక్క ఆడపిల్లను ఓడించేందుకు ఇంత మందా?’’ అని రేవంత్ ప్రశ్నించారు.

‘‘ ఢిల్లీ వాడు వచ్చినా.. గజ్వేల్ తాగుబోతులు వచ్చినా మునుగోడు ప్రజల ముందు బలాదూరే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ ను చంపాలని రాజగోపాల్ రెడ్డి అంటుండు. నిన్ను  ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిపించినందుకా?నీకు ప్రజల్లో విలువను పెంచినందుకా కాంగ్రెస్ ను చంపాలనుకుంటున్నావ్.. రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలి’’ అని పేర్కొన్నారు.  చౌటుప్పల్ మండలంలోని దేవులమ్మ నాగారం, పీపల్ పహాడ్, ఎనగండ్ల తండా, అల్లపురం, జైకేసారం, నేలపట్ల గ్రామాల మీదుగా రేవంత్, ఉత్తమ్ కుమార్ ల ఎన్నికల ప్రచారం కొనసాగింది. కార్యక్రమంలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి  స్రవంతి పాల్గొన్నారు.