సీఎం కేసీఆర్​పై దేశద్రోహం కేసు పెట్టాలె

సీఎం కేసీఆర్​పై దేశద్రోహం కేసు పెట్టాలె
  • పెగాసస్ స్పైవేర్ వాడుకొని ఫోన్లు ట్యాప్ చేస్తున్రు: రేవంత్

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లపై దేశద్రోహం కేసు పెట్టాలని టీపీసీసీ చీఫ్ ​రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్ భద్రత దళాల ఉపయోగం కోసం తయారుచేస్తే, దానిని బీజేపీ, టీఆర్ఎస్ సర్కార్లు రాజకీయాలు, వ్యక్తిగత దాడులకు వినియోగిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులతో పాటు జర్నలిస్ట్ లు, సుప్రీంకోర్టు జడ్జిలు, ఇతర మేధావుల ఫోన్లను హ్యాక్ చేసిందన్నారు. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీపై పెగాసస్ స్పైవేర్ ను వాడటం అప్రజాస్వామికమన్నారు. మంగళవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. ఫోన్ల ట్యాపింగ్ నిజమని గతంలో పార్లమెంటు వేదికగా అప్పటి ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒప్పుకున్నారని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలోనే పక్క రాష్ట్ర సీఎంతో పాటు తెలంగాణ ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసి గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపించారు. ఆ కేసు ఇంకా హైకోర్టులో నడుస్తుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు నేతృత్వంలో పెగాసస్ స్పైవేర్ ను కొని 50 మంది హ్యాకర్లను పెట్టి మరి కాంగ్రెస్ ఎంపీలు, మీడియా సంస్థల యజమానుల నంబర్లను స్నూఫింగ్ లో పెట్టిందన్నారు. ఈనెల 22న ప్రతి రాష్ట్రంలో చలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టాలని ఏఐసీసీ నిర్ణయించినట్లు చెప్పారు.