
హైదరాబాద్/ నిజామాబాద్, వెలుగు: బంగారు కూలీ పేరుతో టీఆర్ఎస్ లీడర్లు వసూళ్లకు పాల్పడిన అంశంపై కేర్టులో కేసు ఉండగా పార్టీ పేరును బీఆర్ఎస్గా ఎలా మారుస్తారని పీసీసీ చీఫ్రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం బోయిన్‌పల్లిలోని ‘గాంధీయన్ ఐడియాలజీ సెంటర్’లో ఆయన మీడియాతో మాట్లాడారు. పేరు మార్చాలంటూ టీఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్నాక అభ్యంతరాలపై పత్రికా ప్రకటన వచ్చిందని, దానిపై ఎన్నికల సంఘం ప్రధానాధికారిని కలిసేందుకు ఐదు సార్లు అపాయింట్మెంట్కోరినా దొరకలేదన్నారు. దాంతో రాష్ట్రపతి, పీఎం, హోం మంత్రికి ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. బంగారు కూలీల పేరుతో 2017లో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు కోట్లు వసూలు చేసిన అంశంపై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసినట్టు చెప్పారు. తన వాదనలు విన్న కోర్టు టీఆర్ఎస్పై చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్‌కు 2018లో ఆదేశాలిచ్చిందన్నారు. అయినా చర్యలు తీసుకోలేదన్నారు. ఇదే అంశంపై ఈ నెల 6న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్టు రేవంత్ చెప్పారు. డిసెంబర్ 7న నోటీసు వెళ్లిందని, సోమవారం (డిసెంబర్ 12) కేసు విచారణకు రానుందన్నారు. కోర్టు విచారణలో ఉన్న అంశాన్ని పక్కన పెట్టి పార్టీ పేరు మార్పు ప్రక్రియను చేపట్టడం సరికాదనే అంశంపై తాను అభ్యంతరం వ్యక్తం చేసినట్టు చెప్పారు. బీజేపీ సూచనల మేరకే ఎన్నికల కమిషన్ టీఆర్ఎస్కు సహకరిస్తున్నదని రేవంత్ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న వాళ్లను ఢిల్లీకి పిలిచి విచారిస్తున్నారని, కానీ కవితను మాత్రం ఆమె కోరిన సమయానికి విచారణ చేస్తామనడం అనుమానాలకు తావిస్తోందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు.
బీఆర్ఎస్గా మార్చడం వెనక కుట్ర
టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడం వెనక కుట్ర దాగి ఉందని రేవంత్ఆరోపించారు. దక్షిణ భారత్‌లో బీఆర్ఎస్ను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ ఓటు బ్యాంకును చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆప్, ఎంఐఎంలు ఉత్తర భారత్‌లో ఓట్లను చీల్చడానికి ఉపయోగపడుతున్నాయన్నారు. కర్నాటకలో బీఆర్ఎస్ను ప్రయోగించి కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఏపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలంగాణను ఏపీలో కలపడానికి సహకరిస్తానని చేసిన కామెంట్స్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదన్నారు. సోనియా జన్మదినం సందర్భంగా గాంధీయన్ సెంటర్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఇటీవల చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు జానారెడ్డి, గీతారెడ్డి పాల్గొన్నారు.
ఆ మూడు పార్టీలు సుపారీ కిల్లర్స్
ఉత్తరాదిన ఆప్ నేత కేజ్రీవాల్, దక్షిణాదిన బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్, ఎంఐఎం అసదుద్దీన్.. ఈ ముగ్గురు కాంగ్రెస్ ను చంపేందుకు రెడీ అయిన సుపారీ కిల్లర్స్ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ మూడు పార్టీలు బీజేపీ తోకపార్టీలన్నారు. శుక్రవారం నిజామాబాద్‌లో రేవంత్ మీడియాతో మాట్లాడారు. త్వరలో కర్నాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటును చీల్చేందుకు బీఆర్ఎస్ పేరిట కేసీఆర్ రెడీ అవుతున్నారన్నారు. గుజరాత్ ఎన్నికల్లో కేసీఆర్ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. దేశంలో ఉన్న సమస్యలను తర్వాత పరిష్కరించొచ్చని, ముందు ధరణిలోని సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారని, అది ఏమైందని ప్రశ్నించారు. పార్టీ మారే నాయకులను మోడీ దగ్గరకు తీసుకెళ్లే అర్వింద్.. పసుపు బోర్డును ఎందుకు తీసుకురాలేకపోతున్నారన్నారు.