మల్లు స్వరాజ్యంను స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్కు లేదు

మల్లు స్వరాజ్యంను స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్కు లేదు

తెలంగాణ విమోచనానికి పోరాటం చేసిన మల్లు స్వరాజ్యంను శాసనసభలో స్మరించుకునే చిత్తశుద్ధి టీఆర్ఎస్ కు లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేళ .. ఆ విమోచనం కోసం సాయుధపోరాటం చేసిన వారిని స్మరించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. టీఆర్ఎస్ ఆరు నిమిషాల్లోనే సభను ముగించి.. వారి త్యాగాలను అవమానించిందంటూ రేవంత్ ట్వీట్ చేశారు. 

మల్లు స్వరాజ్యం మృతికి సంతాపం 

ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్‌‌‌‌ రెడ్డిల మృతికి శాసన సభ్యులు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లో ఎమ్మెల్యేలుగా ఉన్న సమయంలో వారు చేసిన సేవలను అసెంబ్లీ కొనియాడింది. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది. 

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1978 నుంచి 1983 వరకూ, 1983 నుంచి 1984 వరకూ తుంగతుర్తి ఎమ్మెల్యేగా సేవలందించారని స్పీకర్ పోచారం శ్రీనివాస్​ రెడ్డి గుర్తు చేశారు. 1945 నుంచి 1948 వరకూ జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం చురుకైన పాత్ర పోషించారని తెలిపారు. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన మొట్టమొదటి మహిళ  మల్లు స్వరాజ్యం అని గుర్తు చేశారు. 1981 నుంచి 2002 వరకూ ఆంధ్రప్రదేశ్​ మహిళా సంఘం ఉద్యమంలో ఆమె చురుగ్గా పాల్గొని, ఆ సంఘానికి అధ్యక్షురాలిగా సేవలు అందించారని రేవంత్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ లో 1993 సంవత్సరంలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధం ఉద్యమంలోనూ పాల్గొన్నారని పేర్కొన్నారు. 2022 మార్చి 19న మల్లు స్వరాజ్యం తుదిశ్వాస విడిచారని తెలిపారు.