బాతాఖానీ కొట్టేటోళ్లు మాకొద్దు

బాతాఖానీ కొట్టేటోళ్లు మాకొద్దు

హైదరాబాద్: గాంధీ భవన్‌లో త్వరలో పలు మార్పులు చేయనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే వెనుక వైపు కొత్త నిర్మాణాలు చేపడతామన్నారు. పాడి కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంపై రేవంత్ స్పందించారు. కౌశిక్ చిన్న పిల్లాడని, ఆయన వ్యవహారం తనకు ముందే తెలుసన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికే టిక్కెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో ఉండి పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిని వదలబోమని వార్నింగ్ ఇచ్చారు.

కౌశిక్ టీఆర్ఎస్‌తో టచ్ ఉన్నడని తెలుసు
‘కాంగ్రెస్‌లో అన్ని సామాజిక వర్గాల వారికి సమన్యాయం చేస్తాం. ఎల్. రమణకు నాలుగు సార్లు భోజనం పెట్టి కేసీఆర్ టీఆర్‌ఎస్‌లోకి తీసుకున్నారు. సంజయ్ ఉత్తమనిషి కాదు.. సిట్టింగ్ ఎంపీ అర్వింద్ సోదరుడు. చాలా మంది ఇతర పార్టీల నేతలు కూడా మాతో టచ్‌‌లోకి వస్తున్నారు. ధర్మపురి సంజయ్ మున్నూరు కాపు, ఎర్ర శేఖర్ ముదిరాజ్, గండ్ర సత్యనారాయణ రావు వెలమ సామజిక వర్గాలకు చెందిన నేతలు ఇవ్వాళ కాంగ్రెస్‌‌లో చేరారు. కౌశిక్ చిన్న పిల్లగాడు. కౌశిక్‌వి సొంత మాటలు కాదు. కేసీఆర్ మాట్లాడించిన మాటలు. హుజూరాబాద్‌‌లో మా అభ్యర్థి ఎవరో ఇప్పుడే చెప్పం. మాకు కౌశిక్ వ్యవహారం ముందే తెలుసు. టీఆర్ఎస్‌తో టచ్‌‌లో ఉన్నాడని మాకు సమాచారం వుంది. అక్కడ కౌశిక్‌‌కు టిక్కెట్ ఇస్తారని అనుకోవడం లేదు. టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నా.. వారికి అభ్యర్థే కరువయ్యాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ నేతకు గాలం వేశారు’ అని రేవంత్ చెప్పారు. 

కోవర్టులు తీరు మార్చుకోవాల్సిందే
‘కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే టిక్కెట్లు ఇస్తాం. నియోజకవర్గంలో కట్టె పట్టుకొని పని చేయాలి. ఉత్తగనే గాంధీభవన్‌‌లో బాతాఖానీ కొట్టే వాళ్లు అవసరం లేదు. హుజూరాబాద్‌‌లో దమ్మున్న నాయకుడ్నే బరిలో దించుతాం. ఇంటి దొంగల విషయంలో సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేదు. ఎవ్వరైనా సరే కోవర్టులుగా ఉంటే వారి తీరు మార్చుకోవాల్సిందే. సిగరెట్ తాగడం వద్దని డాక్టర్ చెబితే వినాలిగా.. ఇది కూడా అంతే. పార్టీకి నష్టం వాటిల్లే పని ఎవరూ చేయొద్దనేది నా ఆలోచన’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.