కాంగ్రెస్ నేతల అరెస్ట్.. స్పీకర్ కనిపించడం లేదన్న ఉత్తమ్

కాంగ్రెస్ నేతల అరెస్ట్.. స్పీకర్ కనిపించడం లేదన్న ఉత్తమ్

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కనిపించడంలేదని అన్నారు పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. స్పీకర్ ఎక్కడున్నారో కనుక్కుని చెప్పాలని అసెంబ్లీ కార్యదర్శికి కోరామని ఆయన అన్నారు. సీఎల్పీని విలీనం చేసే హక్కు స్పీకర్ కు లేదని చెప్పారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ లో ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ నిస్సిగ్గుగా వ్వవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నారని ఆరోపించారు. కాంట్రాక్టులలో చేసిన దోపిడీ సొమ్ముతో తమ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఉత్తమ్ అన్నారు.

CLP విలీనం కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలవడాన్ని నిరసిస్తూ.. పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉందంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడినుంచి టపాచబుత్ర పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు రవి, షబ్బీర్ అలీ, భట్టి, మల్లు రవి అరెస్టైన వారిలో ఉన్నారు. 

పీసీసీ, సీఎల్పీ నేతల అరెస్టుపై అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపిన అద్దంకి దయాకర్, పొన్నాల లక్ష్మయ్య, ఇందిర శోభన్ లను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నుంచి గెలిచిన 19 ఎమ్మెల్యేలలో 11మంది టీఆర్ఎస్ లో చేరడానికి రెడీ అయ్యారు. ఎంపీగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో… కాంగ్రెస్ బలం 7కు పడిపోయింది. దీంతో సీఎల్పీ విలీనానికి మరో ఎమ్మెల్యే అవసరం ఉండగా.. వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు.

అయితే ఆ 12మంది ఎమ్మెల్యేలు డిఫెక్టర్స్ అని.. వారికి సీఎల్పీ మీటింగ్ పెట్టే అర్హత లేదని అన్నారు ఉత్తమ్. ఈ విషయంపై స్పీకర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించడానికి చూస్తున్నామని అయితే ఆయన కనిపించడంలేదని.. ఫోన్ కూడా మాట్లాడటం లేదని తెలిపారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన 12మంది ఎమ్మెల్యేలు స్పీకర్ శ్రీనివాస్ రెడ్డిని కలిసి సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని వినతి పత్రాన్ని సమర్పించారు.