
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంతో ఇక అమీతుమీ తేల్చుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఆర్టీసీ జేఏసీ నిరసనల్లో విస్తృతంగా పాల్గొనాలని, కార్మికులపై దాడులకు సంబంధించి హక్కుల కమిషన్లకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆదివారం గాంధీభవన్‌లో ఆర్టీసీ సమ్మెపై కాంగ్రెస్ కోర్ కమిటీ ముఖ్య నేతలు భట్టి విక్రమార్క, వీహెచ్, జానారెడ్డి, పొన్నం ప్రభాకర్, కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, నేతలు వినోద్‌రెడ్డి, ఇందిర సమావేశమయ్యారు. ఆర్టీసీ సమ్మెను మరింత ఉదృతం చేసే దిశగా జేఏసీ తీసుకున్న నిరసన కార్యక్రమాల్లో నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొనాలని కమిటీలో నిర్ణయించామని భట్టి ప్రకటనలో తెలిపారు. జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల ఇళ్ల ముందు సోమవారం నిర్వహించే ధర్నాల్లో పాల్గొనాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 12న రాష్ట్రవ్యాప్తంగా డిపోల ముందు నిర్వహించే దీక్షలు, 18న నిర్వహించే సడక్‌బంద్, వంటావార్పులోనూ పాల్గొని కార్మికులకు మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో మానవ, మహిళల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని, ఈ విషయంలో ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్‌లో ఫిర్యాదు చేస్తామని భట్టి విక్రమార్క చెప్పారు.