రాకేష్ను చంపింది టీఆర్ఎస్... చంపించింది బీజేపీ 

రాకేష్ను చంపింది టీఆర్ఎస్... చంపించింది బీజేపీ 

హైదరాబాద్: ఆర్మీ అభ్యర్థి రాకేశ్ ను చంపింది టీఆర్ఎస్ అయితే... చంపించింది బీజేపీ అని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శనివారం వరంగల్ లో రాకేశ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బయలు దేరిన రేవంత్ ను... పోలీసులు ఘట్కేసర్ వద్ద అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... రాకేశ్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే... పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు రాకేశ్ శవయాత్రలో గులాబీ జెండాలు కట్టుకొని పాల్గొంటేలేని తప్పు... తాను వెళ్తానంటేనే వస్తుందా అని మండిపడ్డారు. ప్రజల చావులను కూడా టీఆర్ఎస్ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని, ప్రజలను ఇంకెంతకాలం మోసం చేస్తారని నిలదీశారు, త్వరలోనే సిరిసిల్లా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటిస్తామని తెలిపారు. ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరని, వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్నారు. అగ్నిపథ్ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ డ్రామాలాడుతున్నాయని ఫైర్ అయ్యారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.