అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోరా? 

అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఆదుకోరా? 
  • అమర జవాన్లు, రైతులకు పరిహారం ఇవ్వడం మంచిదే... కానీ
  • దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ ఉవ్విళ్లూరుతుండు
  • దేశం గురించి తర్వాత...  ముందు యాదయ్య కుటుంబాన్ని ఆదుకో
  • సీఎం కేసీఆర్ కు రేవంత్ బహిరంగ లేఖ

హైదరాబాద్: దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన జవాన్లను కూడా సీఎం కేసీఆర్ తన స్వార్ద రాజకీయాల కోసం వాడుకుంటున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అందుకే పక్క రాష్టాలకు వెళ్లి అక్కడి అమర జవాన్ల కుటుంబాలకు పరిహారం అందిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల అమర జవాన్ల కుటుంబాలకు కేసీఆర్ పరిహారం అందిండాన్ని తాము వ్యతిరేకించడం లేదని, కానీ రాష్ట్రానికి చెందిన అమర జవాన్ యాదయ్య కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. బుధవారం సీఎం కేసీఆర్ బీహార్ లో పర్యటించి గాల్వన్ లోయ అమరవీరుల కుటుంబాలకు పరిహారం అందజేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన అమర జవాన్ యాదయ్య కుటుంబానికి పరిహారం ఎందుకు చెల్లించడం లేదంటూ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.  రాష్ట్ర ప్రజల కష్టార్జితం నుంచి కట్టిన పన్నులతో సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రాల్లో పర్యటించడం... అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుందన్నారు. అమర జవాన్లు, ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు పరిహారం అందించడాన్ని కాంగ్రెస్ ఏనాడు వ్యతిరేకించదన్న రేవంత్... కేసీఆర్ పరిహారం అందిచడం వెనుక సానుభూతి కంటే రాజకీయ స్వార్ధమే ఎక్కువ ఉందని ఆరోపించారు.

నిజంగా కేసీఆర్ కు అమర జవాన్లపై గౌరవం ఉంటే... రాష్ట్రానికి చెందిన అమర జవాన్, దళిత బిడ్డ మల్లెపాక యాదయ్య కుటుంబం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య 2013లో కశ్మీర్ కొండల్లో ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారని తెలిపారు. అప్పట్లో ఆయన కుటుంబాన్ని సీఎం కేసీఆర్ కూతరు కవిత స్వయంగా పరామర్శించారని, బాధిత కుటుంబానికి 5 ఎకరాల వ్యవసాయ భూమి, కల్వకుర్తిలో ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఎనిమిదేళ్లు గడుస్తున్నా... ఒక్క రూపాయి సాయం కూడా యాదయ్య కుటుంబానికి చెందలేన్నారు. ఇదేనా కేసీఆర్ కు అమర జవాన్లపై ఉన్న చిత్తశుద్ధి అని ప్రశ్నించారు. పెద్ద దిక్కైనా యాదయ్య మరణంతో  ఆయన కుటుంబం రోడ్డున పడి నానా బాధలు పడుతోంటే పట్టించుకోని కేసీఆర్... బీహార్ అమర జవాన్లకు పరిహారం అందించడం పరిహాసం కాకుంటే మరేంటిదని నిలదీశారు. ఇప్పటికైనా కేసీఆర్ స్వార్ధ రాజకీయాలు మానుకొని యాదయ్య కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు.