
టీఆర్ఎస్,బీజేపీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. షేర్ మార్కెట్ కంటే వేగంగా మునుగోడులో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని తెలిపారు.బడుగు, బలహీన వర్గాలకు వేదిక కాంగ్రెస్ అని..అందుకే హస్తం పార్టీని బతికించుకోవాలని సూచించారు. మునుగోడు మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ శిక్షణ తరగతుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ కార్యక్రమాలకు మంచి స్పందన ఉండేదన్నారు. తెలంగాణలో సమస్యలపై పోరాడేందుకు యూత్ కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత యూత్ కాంగ్రెస్ నాయకులపై ఉందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫిరాయింపు రాజకీయాలను పాతరేయాలంటే అది యూత్ కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు.బీజేపీ, టీఆర్ఎస్ కుట్రలను అందరూ కలిసికట్టుగా పోరాడి తిప్పికొట్టాలన్నారు. దళిత, బహుజనులు ఎవరైనా టీఆరెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అని ప్రశ్నించారు. కలలో కూడా సీఎం కేసీఆర్ అలాంటి ఆలోచన రానివ్వడన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశంలో, రాష్ట్రంలో పేదలు బానిసలుగా బతకాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.