వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది

ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు.. బతికి సాధించుకోవాలె
ముఖ్యమంత్రి కేసీఆర్ కు లేఖ రాస్తా : రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : రాష్ట్రంలోని వీఆర్ఏలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేదల ప్రాణాలంటే లెక్క లేదని, వీఆర్ఏలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. సమస్యలకు చావులు పరిష్కారం కాదని, బతికి ఏదైనా సాధించుకుందామన్నారు. రాష్ర్ట ప్రభుత్వంపై పోరాడి, హామీలను నెరవేర్చుకోవాలని వీఆర్ఏలకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపల్లి మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ కోరబోయిన అశోక్ కుటుంబ సభ్యులను రేవంత్ రెడ్డి ఫోన్ లో పరామర్శించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ నేత సుభాష్ రెడ్డి.. బాధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రేవంత్ రెడ్డితో మాట్లాడించారు. ఆ తర్వాత వీఆర్ఏ సంఘం నాయకులతోనూ రేవంత్ రెడ్డి మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వంతో కొట్లాడి సమస్యలను పరిష్కరించుకోవాలని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వీఆర్ఏ సంఘం నాయకులకు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. వీఆర్ఏల హామీల అమలు కోసం సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో మాట్లాడి.. అసెంబ్లీలో చర్చించేలా కృషి చేస్తానని తెలిపారు. వీఆర్ఏల సమస్యల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కు వివరంగా లేఖ రాస్తానని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 22మంది వీఆర్ఏలు చనిపోయారని, వారందరికీ నష్టపరిహారం లభించేలా చూడాలని రేవంత్ రెడ్డిని వీఆర్ఏల సంఘం నాయకులు కోరారు. 

జీతాలు రాకపోవడంతో చేసిన అప్పులు కట్టలేక తీవ్ర మనస్తాపానికి గురైన బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ కోరబోయిన అశోక్(28) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏలు 40 రోజులుగా చేస్తున్న ఆందోళనలలో అశోక్ చురుగ్గా పాల్గొన్నాడు. ఆదివారం రోజు ఉదయం గ్రామ శివారులోని దాల్ మల్ గట్టు మీద అశోక్ చెట్టుకు ఉరివేసుకున్నట్లుగా గుర్తించారు.