తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి : టీపీఎఫ్‌‌

తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణకు చట్టం తేవాలి : టీపీఎఫ్‌‌

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయడంతో పాటు ప్రైవేట్‌‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కఠిన చట్టం తీసుకురావాలని తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్‌‌(టీపీఎఫ్) ప్రభుత్వాన్ని డిమాండ్‌‌ చేసింది. బుధవారం టీపీఎఫ్ సభ్యుల బృందం అడ్డగుట్ట బస్తీలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించింది. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల ప్రాంగణంలోనే తహసీల్దార్‌‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కమ్యూనిటీ సమావేశంలో 50 మందికిపైగా మహిళలు తమ సమస్యలను వివరించారు. 

తల్లుల సంఘం అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, టీపీఎఫ్‌‌ సభ్యులు ఆకూనూరి మురళి, డాక్టర్‌‌ ఎంవీ రెడ్డి మాట్లాడుతూ.. ఆరుట్లలో ఏర్పాటు చేసిన తరహాలో తమ ప్రాంతంలోనూ ‘తెలంగాణ పబ్లిక్‌‌ స్కూళ్లు’ ఏర్పాటు చేయాలని డిమాండ్‌‌ చేశారు. ప్రైవేట్‌‌ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందకపోయినా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బడుల బలోపేతానికి, ప్రైవేట్‌‌ ఫీజుల నియంత్రణ చట్టం కోసం పోరాడుతామన్నారు. కార్యక్రమంలో టీపీఎఫ్‌‌ ప్రతినిధులు ప్రొఫెసర్‌‌ పద్మజ, కుమార్‌‌, నిఖిల్‌‌ విజయ్‌‌ కృష్ణ, ఎంవీ ఫౌండేషన్‌‌ సిబ్బంది స్వామి, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.