ఏఐ డేటా సెంటర్ బిజినెస్‌‌ కోసం టీపీజీ, టీసీఎస్ జత

ఏఐ డేటా సెంటర్ బిజినెస్‌‌ కోసం టీపీజీ, టీసీఎస్ జత
  • రూ.18 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఇరు కంపెనీలు

న్యూఢిల్లీ: ఏఐ డేటా సెంటర్‌‌‌‌ బిజినెస్‌‌ కోసం అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ  కంపెనీ టీపీజీతో టీసీఎస్‌‌ చేతులు కలిపింది. ఇరు కంపెనీలు కలిసి హైపర్ వాల్ట్‌‌ ఏఐ డేటా సెంటర్ లిమిటెడ్‌‌ అనే జాయింట్ వెంచర్‌‌‌‌ను విస్తరించనున్నాయి. ఇందులో టీసీఎస్‌‌కు 51 శాతం వాటా దక్కుతుంది. టీపీజీ రూ.8,820 కోట్ల వరకు  ఇన్వెస్ట్ చేయనుంది. ఈ కంపెనీకి 27.5 శాతం నుంచి 49 శాతం మధ్య వాటా దక్కనుంది. టీపీజీ ఎంత మేర పెట్టుబడి పెడుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇరు కంపెనీలు ఈ జాయింట్ వెంచర్‌‌‌‌లో రూ.18 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాయని అంచనా.

ఇండియాలో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌‌‌‌ను హైపర్ వాల్ట్ నిర్మిస్తుంది.  టీసీఎస్‌‌ ఏఐ సర్వీస్‌‌లకు సపోర్ట్ అందిస్తుంది.   తమ క్లయింట్లకు, పార్టనర్లకు పూర్తి స్థాయి ఏఐ సర్వీస్‌‌లు అందించే పొజిషన్‌‌లో ఉన్నామని  టీసీఎస్‌‌ చైర్మన్  చంద్రశేఖరన్ అన్నారు. ఏఐ కంపెనీలతో భాగస్వామ్యం బలపరుచుకుంటామని పేర్కొన్నారు. 

కాగా, ఏఐ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను డెవలప్ చేసేందుకు ఫుల్లీ ఓన్డ్ సబ్సిడరీని ఏర్పాటు చేశామని టాటా గ్రూప్ ఇప్పటికే ప్రకటించింది. గిగావాట్ కెపాసిటీ గల డేటా సెంటర్‌‌‌‌ను రానున్న ఏడేళ్లలో నిర్మించనుంది.