లక్సెట్టిపేట, వెలుగు: గొర్ల మందపైకి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో 28 జీవాలు మృత్యువాతపడ్డాయి. ఎస్సై గోపతి సురేశ్తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా అశోక్ నగర్ కు చెందిన గజలప్ప తన గొర్రెలను మేత కోసం గ్రామాల్లో తిప్పుతున్నాడు. మంగళవారం దండేపల్లి నుంచి మంచిర్యాల వైపునకు గొర్రెల మందతో వెళ్తున్నాడు. ఈ క్రమంలో లక్సెట్టిపేట మండలంలోని సూరారం గ్రామ స్టేజీ సమీపంలో సిమెంట్ ఇటుకల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అతివేగంగా గొర్రెల మంద పైకి దూసుకువచ్చి బోల్తా పడడంతో 28 గొర్రెలు మృతిచెందాయి. ఈ ప్రమాదంలో రూ.4 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
