వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు గురువారం ఉదయం నిరసనకు దిగారు. వారం రోజుల క్రితం లడే తిరుపతి అనే వ్యాపారి సుమారు రూ. మూడు కోట్లకు ఐపీ పెట్టి పరారయ్యాడు. మోసపోయిన వారిలో ఆడ్తిదారులు, కొంతమంది వ్యాపారులు ఉన్నారు. గతంలో కూడా తిరుపతి జమ్మికుంట మార్కెట్లో ఇలాగే మోసం చేసి కోట్ల రూపాయలతో అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం వరంగల్ మార్కెట్ కు చేరుకొని తన భార్య మాధవి పేరుతో గత సంవత్సరం క్రితం కొనుగోలు లైసెన్సు పొందాడు.
అనంతరం ఇక్కడ సైతం వ్యాపారులను మోసగించి ఉడాయించాడు. తిరుపతి మోసం చేశాడని, డబ్బులు తీసుకొని పారిపోయాడని గ్రహించిన వ్యాపారులు పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కు ఇటీవల ఫిర్యాదు చేశాడు. దీంతో ఏనుమాముల సీఐ సురేశ్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్లో తిరుపతిని పట్టుకొని వరంగల్ కు తీసుకువచ్చారు. ప్రస్తుతం తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే తన వద్ద రూపాయి కూడా లేదని, ఏమి చేసుకుంటారో చేసుకోమని ఎదురు తిరగడంతో వ్యాపారులు గురువారం కొనుగోలు, అమ్మకాలను నిలిపివేసి నిరసనకు దిగారు.
అనంతరం మార్కెట్లో ర్యాలీ తీశారు. వ్యాపారస్తులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ లోని అధికారుల కార్యాలయం ఎదుట నిరసనకు దిగడంతో ధరలు, కాంటాలు నిలిచిపోయాయి. అనంతరం మంత్రి సురేఖతోపాటు పోలీస్ కమీషనర్ వ్యాపారస్తులతో మాట్లాడి నచ్చ చెప్పడంతో క్రయ, విక్రయాలు జరిగాయి.
