ఖమ్మంలో మిర్చి రేట్లపై నమ్మించి మోసం..మార్కెట్కు పంట తీసుకురాగానే రూ. 1,100 తగ్గింపు

ఖమ్మంలో మిర్చి రేట్లపై నమ్మించి మోసం..మార్కెట్కు  పంట తీసుకురాగానే రూ. 1,100 తగ్గింపు
  • రేటు భారీగా పెరిగినట్టు మీడియాలో వ్యాపారుల ప్రచారం
  •     మార్కెట్​కు  పంట తీసుకురాగానే ఒక్కసారిగా రూ. 1,100 తగ్గింపు
  •     జెండా పాట 20,100 పెట్టి, 17 వేలకు మించి కొనడం లేదని రైతుల ఆరోపణ 
  •     మూడు గంటల పాటు మార్కెట్​లో ఆందోళన

ఖమ్మం, వెలుగు: ఖమ్మం వ్యవసాయ మార్కెట్​లో రైతులను వ్యాపారులు నమ్మించి మోసం చేస్తున్నారు. రేటు భారీగా పెరిగినట్లు మీడియాలో ప్రచారం చేసి.. తీరా పంటను మార్కెట్​కు తీసుకువచ్చిన తర్వాత రేటు తగ్గించి కొనుగోలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్​కు శుక్రవారం ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్​తో పాటు ఏపీలోని కృష్ణా జిల్లా నుంచి రైతులు మిర్చి పంటను తీసుకొచ్చారు. ఉదయాన్నే జెండా పాట క్వింటా రూ.20,100గా నిర్ణయించి కొనుగోలు చేశారు. 

ఒక లాట్​కు మాత్రమే ఎక్కువ రేటు పెట్టి, మిగిలిన పంటను మొత్తం రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు  తగ్గించారు.  క్వింటాలు రూ.17 వేల కన్నా  తక్కువ రేటుకే కొనుగోలు చేయడంతో రైతులు ఆందోళనకు దిగారు. తేజా రకం మిర్చికి మంచి రేటు పలుకుతుందని మార్కెట్​కు తీసుకువస్తే, అగ్గువకే అడుగుతున్నారంటూ మార్కెట్ కమిటీ అడ్మినిస్ట్రేషన్​ కార్యాలయం, మెయిన్ గేట్ దగ్గర బైఠాయించారు. దాదాపు 3 గంటల పాటు మిర్చి కొనుగోళ్లను అడ్డుకున్నారు. జెండా పాట రేటును పెంచుకుంటూ వెళ్లి.. మార్కెట్​కు ఎక్కువ పంట తీసుకురాగానే  రేటు తగ్గించి రైతులను మోసం చేస్తున్నారని వాపోయారు. వ్యాపారులంతా సిండికేట్ గా ఏర్పడి, తమను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. వ్యాపారులు మాత్రం క్వాలిటీని బట్టి రేటు ఉంటుందని, కొనుగోళ్లను నిలిపివేశారు.  దీంతో రైతులు, మార్కెట్ కమిషన్​దారులు, వ్యాపారుల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. మార్కెట్ శాఖ గ్రేడ్ వన్ సెక్రటరీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, వైస్ చైర్మన్ రమేశ్, చాంబర్ ఆఫ్​ కామర్స్​ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్  రైతులు, వ్యాపారులతో చర్చలు జరిపారు. జెండా పాట రేటుకు  రూ.500 తేడాతో  కొనుగోలు చేస్తామని వ్యాపారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. తర్వాత మళ్లీ కొనుగోళ్లు జరిగాయి.

దిగుబడి తగ్గిందంటే.. రేట్లలోనూ అన్యాయం 

ఈ సీజన్​లో రెండు వారాల  నుంచి మార్కెట్​కు సరుకు వస్తోంది. సంక్రాంతికి ముందు వరకు క్వింటాలు రేటు రూ.16 వేలలోపు ఉండగా, సంక్రాంతి  తర్వాత బుధవారం రూ.20 వేలు పలికింది. గురువారం రూ.21,100 జెండా పాటగా నమోదైంది. అయితే, జెండా పాటను ఒకరిద్దరు రైతులు తెచ్చిన పంటకు మాత్రమే చెల్లించి, మిగిలిన మిర్చిని తక్కువకే కొంటుండడంతో తమకు నష్టం వస్తుందని రైతులు వాపోతున్నారు. అసలే ఈసారి దిగుబడి తగ్గిందని,  రేట్లలోనూ  అన్యాయం చేస్తున్నారని తెలిపారు. వ్యూహం ప్రకారమే వ్యాపారులు మోసం చేస్తున్నారని  ఆరోపిస్తున్నారు. ఒక వర్గం వ్యాపారులు జెండా పాట రేటును పెంచుకుంటూ పోతుంటే, మరోవర్గం మాత్రం అగ్గువకు పంట కొంటున్నారని రైతులు చెబుతున్నారు. 

అగ్గువకు అడుగుతున్నరు..  

క్వింటా మిర్చి రూ.20 వేలకు పైగా రేటు వస్తున్నట్టు పేపర్లలో చూసి 15 బస్తాల మిర్చి ఖమ్మం మార్కెట్​ను తీసుకొచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యాపారులు రేటు తగ్గించేశారు. క్వింటా రూ.16 వేలకు మించి పెట్టలేమని చెబుతున్నారు. రెండ్రోజుల నుంచి రేటు పెరిగిందని అందరినీ నమ్మించి.. మార్కెట్ కు వచ్చిన తర్వాత తక్కువ రేటు అడుగుతున్నారు. అసలే ఈసారి దిగుబడి తక్కువగా ఉంది. వ్యాపారుల మోసాలకు అధికారులు అడ్డుకట్ట వేయాలి.   - గుత్తా కృష్ణ, వైరా