ఏనుమాముల మార్కెట్లో పత్తి వ్యాపారుల ఆందోళన

ఏనుమాముల మార్కెట్లో పత్తి వ్యాపారుల ఆందోళన

కాశీబుగ్గ, వెలుగు: రివర్స్​ చార్జ్​ మెకానిజం(ఆర్​సీఎం) ఎత్తేయాలంటూ వరంగల్​ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లోని వ్యాపారులు మంగళవారం కొనుగోళ్లు బంద్​చేసి ఆందోళన చేపట్టారు. చాంబర్ ఆఫ్​ కామర్స్​ ప్రెసిడెంట్ ​బొమ్మినేని రవీందర్​రెడ్డి మాట్లాడుతూ వ్యాపారులు రైతుల వద్ద పత్తి కొన్నప్పుడు ముందుగా 5 శాతం టాక్స్ ​కట్టాల్సి వస్తోందన్నారు. కాటన్​ప్రాసెస్​తర్వాత గింజలు, దూది వేరు చేసి బేళ్లు అమ్మినప్పుడు కట్టిన టాక్స్​ఇన్​పుట్​ఇస్తారన్నారు. ఇందుకు ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతోందన్నారు. వ్యాపారులు ముందు పెట్టుబడి పెట్టడం వల్ల ఆర్థికభారం ఎక్కువవుతోందని చెప్పారు.

పంట ఉత్పత్తులపై పెట్టిన ఆర్​సీఎం ఎత్తేయాలని తెలంగాణ కాటన్​అసోసియేషన్​ నుంచి అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వినతిపత్రం అందజేసినప్పటికీ ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే పత్తి, ఇతర పంట ఉత్పత్తుల కొనుగోళ్లు బంద్​చేసి నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పత్తిపై ఆర్​సీఎం ఎత్తివేయాలని దేశవ్యాప్తంగా కాటన్​ జిన్నింగ్​ అండ్ ప్రెస్సింగ్ ఇండస్ట్రీస్​ఆధ్వర్యంలో వచ్చే నెల 15న టోకెన్​సమ్మె చేయనున్నట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేదంటే పత్తి కొనుగోళ్లు బంద్​చేస్తామని అన్నారు. 

నిలిచిన కొనుగోళ్లు

వ్యాపారులు ఆందోళన బాట పట్టడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్లో కొనుగోళ్లు నిలిచిపోయాయి. మార్కెట్​కు సుమారు ఆరు వేలకు పైగా పత్తి బస్తాలు తెచ్చిన రైతులు కొనుగోళ్లు జరుగుతాయో లేదోననే ఆందోళనతో మార్కెట్​ఆఫీసర్లను కలిశారు. పత్తి కొనుగోలు చేయించాలని కోరారు. సుమారు రెండు గంటల తర్వాత మళ్లీ కొనుగోళ్లు షురూ చేశారు.