షాప్​లు పోతే మేమెట్ల బతకాలె?

షాప్​లు పోతే మేమెట్ల బతకాలె?

హుస్నాబాద్, వెలుగు: సిద్దిపేట నుంచి హుస్నాబాద్​ మీదుగా ఎల్కతుర్తి వరకు నిర్మిస్తున్న నేషనల్ హైవేతో తమ షాప్​లు పోతున్నాయని హుస్నాబాద్​ వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. హైవే నిర్మాణాన్ని ఇక్కడ 100 ఫీట్లు కాకుండా 80 ఫీట్లకు తగ్గించాలని డిమాండ్​ చేశారు. ఇందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో శనివారం మెయిన్​రోడ్డుకు ఇరువైపులా ఉన్న 800 షాప్​లను బంద్​ చేసి నిరసనకు దిగారు. 

అంబేద్కర్​ చౌరస్తాలో రాస్తారోకో చేశారు. హైవే నిర్మాణంతో కొన్ని షాప్​లు పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా పోతున్నాయని షాప్​లు లేకుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. అధికారులు దీనిని దృష్టిలో ఉంచుకొని హైవేను హుస్నాబాద్​లో 80 ఫీట్లతోనే నిర్మించాలని డిమాండ్​ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.