కామారెడ్డి ప్రధాన చౌరస్తాలు, మెయిన్ రోడ్లపై కనిపించని నియంత్రణ...ట్రాఫిక్ పీఎస్ వచ్చేనా?

 కామారెడ్డి ప్రధాన చౌరస్తాలు, మెయిన్ రోడ్లపై కనిపించని నియంత్రణ...ట్రాఫిక్ పీఎస్ వచ్చేనా?
  • కామారెడ్డి ప్రధాన చౌరస్తాలు, మెయిన్​ రోడ్లపై కనిపించని నియంత్రణ
  • ఫైన్ల విధింపుపైనే తాత్కాలిక సిబ్బంది ఫోకస్ 
  • జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లేక సిబ్బంది కొరత
  • సమస్య పరిష్కరించాలని జిల్లావాసుల మొర

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా మారింది.  ప్రధాన చౌరస్తాలు, మెయిన్​ రోడ్లపై వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.   జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్ లేకపోవడంతో సిబ్బంది కొరత ఉంది. తాత్కాలిక సిబ్బంది ఫైన్లు విధించటంపైనే ఫోకస్ పెడుతూ ట్రాఫిక్​ను  గాలికొదిలేస్తున్నారు. కామారెడ్డి 5 జిల్లాల కూడలి.  పట్టణంలో  లక్షన్నరకు పైగా జనాభా ఉంటుంది. పనుల నిమిత్తం వచ్చేవారు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తారు. మార్నింగ్, ఈవ్​నింగ్ స్కూల్స్, కాలేజీల సమయాల్లో ట్రాఫిక్ జామ్ తలనొప్పిగా మారుతోంది. 

రద్దీ ప్రాంతాలు.. 

అశోక్ నగర్ కాలనీ చౌరస్తా నుంచి కొత్త బస్టాండ్, హౌసింగ్ బోర్డు కాలనీ వరకు ఉన్న మెయిన్​ రోడ్డు, నిజాంసాగర్ రోడ్డు,  మున్సిపల్ ఆఫీస్, సిరిసిల్లా రోడ్డు, స్టేషన్ రోడ్డు, తిలక్​రోడ్డు, సుభాష్ రోడ్డు,  మాయాబజార్​, పాత బస్టాండ్, ఇందిరా చౌక్, ధర్మశాల, రామారెడ్డి రోడ్డు ఏరియాలతోపాటు చౌరస్తాల వద్ద ట్రాఫిక్ రద్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏరియాల్లో  షాపింగ్​ మాల్స్ కూరగాయల దుకాణాలు, విద్యా  సంస్థలు ఉన్నాయి. వీటికి తోడుగా రోడ్లు ఇరుకుగా ఉండడంతో చౌరస్తాల వద్ద యూటర్న్​ తీసుకుంటున్నప్పుడు ట్రాఫిక్​ జామ్​ అవుతోంది. పార్కింగ్ లేక కొందరు వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు.   ఈ మెయిన్​ చౌరస్తాల వద్ద ట్రాఫిక్​ పోలీసులు కనిపించరు.  నిజాంసాగర్​ చౌరస్తా, మున్సిపల్​ఆఫీస్ వద్ద  బస్సులు, హెవీ వెహికల్స్ యూ టర్న్ కష్టమవుతోంది. రాఖీ పౌర్ణమి  టైంలో తీవ్ర ట్రాఫిక్ సమస్య తలెత్తింది. 

ఫైన్ల విధింపుపైనే ఫోకస్​.. 

టౌన్ పోలీస్​ స్టేషన్ నుంచి కొందరు, ఏఆర్​ నుంచి కొందరు సిబ్బందిని నియమించారు. ఎస్సై, 10  మంది కానిస్టేబుల్స్​, హోం గార్డులు ఉన్నారు.   వీరు  ప్రధాన చౌరస్తాల్లో ఉంటూ  కేవలం ఫైన్ల విధింపునకే పరిమితమయ్యారు.  హెల్మెట్​లేని వారికి,  త్రిబుల్​ రైడింగ్​,  డ్రంక్​ అండ్​ డ్రైవ్ టెస్టులు,  పాత ఫైన్ల వసూళ్లకే ప్రయార్టీ ఇస్తున్నారు.   

 ప్రతిపాదనలకే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్.. 

కామారెడ్డిలో ట్రాఫిక్​ పోలీస్​ స్టేషన్​ ప్రతిపాదనలకే పరిమితమైంది.  జిల్లా కేంద్రంగా మారిన తర్వాత ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​కు ప్రపోజల్ చేశారు.  కలెక్టరేట్​ ప్రారంభోత్సవంలో అప్పటి సీఎం కేసీఆర్ ట్రాఫిక్​  పోలీస్​ స్టేషన్​ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించినా కార్యరూపం దాల్చలేదు. నిజాంసాగర్​ చౌరస్తా,  కొత్త బస్టాండ్​ ఏరియాల్లో  సిగ్నల్స్​ ఏర్పాటు చేశారు.   2 ఏండ్లుగా కొత్త  బస్టాండ్ ఏరియాలోని సిగ్నల్స్​పని చేయట్లేదు. 

ట్రాఫిక్ పై ఫోకస్​ చేస్తున్నాం

జిల్లా కేంద్రంలో ట్రాఫిక్​ వ్యవస్థపై ఫోకస్​ చేశాం.  ట్రాఫిక్​ పోలీస్ స్టేషన్​ ఏర్పాటైతే అధికారులు, సిబ్బంది  కొరత ఉండదు. ట్రాఫిక్​ కంట్రోల్​పై స్థానిక అధికారులతో చర్చించా.  మరికొందరు సిబ్బందిని నియమిస్తాం.  
-రాజేశ్​చంద్ర, కామారెడ్డి ఎస్పీ