
హైదరాబాద్ సిటీ, వెలుగు: ధూల్పేటలో గణేశ్ విగ్రహాల విక్రయం, కొనుగోలు, తరలింపు కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి బుధవారం రాత్రి 10 గంటల వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయెల్ డేవిస్ వెల్లడించారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇవీ..
బోయిగూడ కమాన్ నుంచి గాంధీ విగ్రహం వరకు, అలాగే దానికి ఎదురుగా వచ్చే సాధారణ వాహనాలకు ఈ నాలుగు రోజులు అనుమతి ఉండదు. గణేశ్ విగ్రహాలను తరలించే వాహనాలు గాంధీ విగ్రహం, పురానాపూల్ వైపు నుంచి ప్రవేశించి, బోయిగూడ కమాన్ క్రాస్ రోడ్స్ నుంచి బయటకు వెళ్లాలి. గాంధీ విగ్రహం, పురానాపూల్ నుంచి మంగళహాట్ వైపు వెళ్లే సాధారణ వాహనాలను.. తక్కర్‌వాడి టీ జంక్షన్, జిన్సీ చౌరాహీ, ఘోడే-కే-ఖబర్ వైపు మళ్లిస్తారు. సీతారాంబాగ్ నుంచి మంగళహాట్, పురానాపూల్ వైపు వెళ్లే వాహనాలు బోయిగూడ కమాన్ క్రాస్ రోడ్స్ వద్ద కార్వాన్ రోడ్ వైపు మళ్లిస్తారు.
దరుస్సలాం నుంచి మంగళహాట్, పురానాపూల్ వైపు వెళ్లే వాహనాలు.. బోయిగూడ కమాన్ వద్ద అఘాపుర, ఘోడే కే ఖబర్, జిన్సీ చౌరాహీ, తక్కర్‌వాడి టీ జంక్షన్ మీదుగా వెళ్లాలి. గణేశ్ విగ్రహాల రవాణా కోసం వచ్చే లారీలు, డీసీఎంలు జుమ్మేరత్ బజార్ గ్రౌండ్లో పార్క్ చేయాలి. ఈ వాహనాలకు రాత్రి 10 గంటల తర్వాతే విగ్రహాలను తీసుకెళ్లడానికి అనుమతి ఉందని జాయింట్ సీపీ తెలిపారు.
ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే.. లారీలు, డీసీఎంలు 100 ఫీట్ రోడ్, పురానాపూల్ వద్ద పార్క్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే, ఎంజే బ్రిడ్జ్ నుంచి జుమ్మేరత్ బజార్ రోడ్ వరకు ఒకే లైన్‌లో వాహనాలను పార్క్ చేసుకోవచ్చని చెప్పారు.