
హైదరాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. గత రెండు రోజులుగా కురిసిన ఎడతెరిపి లేని వర్షంతో నిజామాబాద్ జలమయమైంది. భారీ వరదకు జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. ముఖ్యంగా కామారెడ్డి జిల్లాపై వరుణుడు విశ్వరూపం చూపించాడు. గడిచిన 48 గంటల్లో కామారెడ్డిలో ఆల్ టైం రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షంతో కామారెడ్డి అతలాకుతలం అయ్యింది.
వరద ధాటికి చాలా ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు వరద నీరు చేరింది. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వరద నీరు భారీగా రోడ్లపైకి చేరింది. వరదలకు రోడ్ల దెబ్బ తిన్నాయి. ఈ క్రమంలోనే కామారెడ్డి మండలం టేక్రియాల్ చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో క్యాసంపల్లి దగ్గర 44వ జాతీయ రహదారికి భారీ గండి పడింది. రోడ్డు కుంగడంతో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి.
దాదాపు 20 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సదాశివనగర్ నుంచి పొందుర్తి వరకు ట్రాఫిక్ జామ్ నెలకొంది. భారీ ట్రాఫిక్ జామ్తో ముందుకు కదలలేక వాహనదారులు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తు్న్నారు. రంగంలోకి దిగిన పోలీసులు, స్థానిక యంత్రాగం యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పునరుద్ధరణ పనులు చేపట్టారు. భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని వాహనదారులకు పోలీసులు సూచిస్తున్నారు.