రేపు ట్యాంక్‌బండ్‌ చుట్టూ.. ట్రాఫిక్ ఆంక్షలు

రేపు ట్యాంక్‌బండ్‌ చుట్టూ..  ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌, వెలుగు: తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా  ట్యాంక్‌బండ్‌  పరిసర ప్రాంతాల్లో గురువారం ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్స్‌ అమల్లో ఉండనున్నట్లు ట్రాఫిక్ చీఫ్‌ సుధీర్‌‌బాబు తెలిపారు. ట్రాఫిక్‌ డైవర్షన్ల వివరాలతో మంగళవారం ఆయన నోటిఫికేషన్‌ రిలీజ్ చేశారు. వీఐపీల మూవ్‌మెంట్‌కు అనుగుణంగా ట్రాఫిక్​ను నిలిపివేయడం, దారి మళ్లింపు ఉంటుందన్నారు.

అవసరమైతే ట్యాంక్‌బండ్ రోడ్​ను క్లోజ్‌ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎన్టీఆర్ గార్డెన్స్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్కులకు వెళ్లే దారిని క్లోజ్ చేయనున్నట్లు తెలిపారు. వీవీ జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్రభారతి, మింట్ కాంపౌండ్ రోడ్, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్టమైసమ్మ, ట్యాంక్ బండ్, లిబర్టీ, కర్బాల మైదాన్, చిల్డ్రన్ పార్కు, రాణిగంజ్​రూట్​లో ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు ఇతర మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. గురువారం ట్యాంక్​బండ్ పరిసరాల్లోని పార్కులకు సెలవు ప్రకటిస్తున్నట్లు హెచ్ఎండీఏ పేర్కొంది.  లుంబినీ పార్క్, ఎన్టీఆర్ ఘాట్, ఎన్టీఆర్ గార్డెన్లను మూసివేయనున్నట్లు తెలిపింది. 

ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా..

 ఖైరతాబాద్​లోని విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు ట్రాఫిక్​కు అనుమతి లేదు.

ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వెహికల్స్​ను షాదన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా దారి మళ్లిస్తారు.

నిరంకారీ భవన్, చింతల్ బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ మీదుగా వెహికల్స్​ను అనుమతించరు. 

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్​బండ్ వైపు వెహికల్స్​కు అనుమతి లేదు. తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. 

బుద్దభవన్‌ నుంచి నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ రూట్​లో వచ్చే వెహికల్స్​ను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ మీదుగా దారి మళ్లించనున్నారు.  

లిబర్టీ అంబేద్కర్ విగ్రహం, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్​లో వెహికల్స్​కు అనుమతి లేదు.  వాటిని ఇక్బాల్ మినార్ జంక్షన్ మీదుగా దారి మళ్లిస్తారు. 

రాణిగంజ్, కర్బాల మైదాన్, కవాడిగూడ నుంచి ట్యాంక్ బండ్  వైపు వచ్చే వెహికల్స్​ను లోయర్ ట్యాంక్ బండ్ రూట్​లో దారి మళ్లిస్తారు.

బడా గణేశ్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరీ వైపు వెళ్లే ట్రాఫిక్​ను ​రాజ్​దూత్ లేన్ మీదుగా దారి మళ్లిస్తారు. 

సికింద్రాబాద్‌ నుంచి ట్యాంక్​బండ్ ​వైపు వెహికల్స్​కు అనుమతి లేదు. లోయర్ ట్యాంక్​ బండ్ సెయిలింగ్ క్లబ్ వద్ద వాటిని దారి మళ్లిస్తారు.