లష్కర్ బోనాలు షురూ...తొలి బోనం సమర్పించిన తలసాని

లష్కర్ బోనాలు షురూ...తొలి బోనం సమర్పించిన తలసాని

సికింద్రాబాద్  ఉజ్జయిని మహంకాళి  బోనాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ(జూలై9) ఉదయం తెల్లవారుజామున  అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులు  తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం నుంచే మహంకాళి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకుంటున్నారు.   ఇవాళ, రేపు రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి.  సోమవారం రంగం, అంబారీపై అమ్మవారి ఊరేగింపు, ఫలహార బండ్లపై ఊరేగిస్తారు.    బొనాల సందర్భంగా ఆలయంలో 15రోజులు పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. బోనాలు, ఓడి బియ్యం సమర్పణతో ఆలయం కిటకిటలాడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు.

ఇవాళ ఉదయం నుంచి రాత్రి వరకు కంటిన్యూగా అమ్మవారి దర్శనాలు కొనసాగనున్నాయి. శివసత్తులు, జోగినీలు అమ్మవారికి బోనం సమర్పించేందుకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్లాట్ కేటాయించారు.  భక్తులు భద్రత కోసం ఆలయంలో 20 సీసీ కెమెరాలు ఉండగా....జాతర సందర్బంగా మరో 250 సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు.

బోనాల సందర్భంగా ఆలయ పరిసరాల్లో  రెండు రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఆలయానికి వచ్చే భక్తుల వెహికిల్స్ పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కర్బలా మైదాన్, రాణిగంజ్, ఓల్డ్ పిఎస్ రాంగోపాల్‌పేట్, ప్యారడైజ్, సిటిఓ, ప్లాజా, ఎస్‌బిఐ ఎక్స్ రోడ్, వైఎమ్‌సిఎ, ఎక్స్ రోడ్స్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్ రోడ్, ప్యాట్నీ ఎక్స్ రోడ్, రోడ్లు, జంక్షన్‌లలో రాకపోకలు నిషేధం అని తెలిపారు.  సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవడానికి ముందుగానే బయలుదేరాలని పోలీసులు సూచించారు.  సికింద్రాబాద్​వచ్చే మార్గంలో సైతం ట్రాఫిక్ ఉంటుందని తెలిపారు. 

భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ఉజ్జయిని మహంకాళి ఆలయంతో పాటు సికింద్రాబాద్ ఏరియాలోని మరో 9 ఉప ఆలయాల్లోనూ బోనాల ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. లష్కర్ బోనాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్న నేపథ్యంలో అందుకు తగిన విధంగా నిర్వాహకులు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారికి బోనాలు సమర్పించే భక్తుల కోసం స్పెషల్ క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ బాటా నుంచి సుభాష్​ రోడ్ మీదుగా ఓ క్యూ లైన్, ఎంజీ రోడ్ నుంచి మరో క్యూ లైన్ ను ఏర్పాటు చేశారు. బోనాలతో వచ్చే భక్తులు నేరుగా ఈ రెండు క్యూ లైన్లలో వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించాలి.

ఫుల్ సెక్యూరిటీ..

గుడి లోపల, బయట, ప్రధాన ముఖ ద్వారం, సుభాష్​రోడ్, ఎంజీ రోడ్, ఎస్ డీ రోడ్ ప్రాంతాల్లో 2,500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తును ఉంచారు. ఆలయం వద్ద, చుట్టుపక్కల 200 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు.  

7 లక్షల తాగునీటి ప్యాకెట్లు..

క్యూలైన్లలో ఉన్న భక్తుల కోసం వాటర్ బోర్డు అధికారులు 7 లక్షల తాగునీటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఆలయ ప్రాంగణంలోని 6 చోట్ల డ్రింకింగ్ వాటర్ క్యాంప్​ను ఏర్పాటు చేశారు.  మహంకాళి పీఎస్, బాటా, అంజలి థియేటర్, రోచా బజార్ ప్రాంతాల్లో 4 మెడికల్ క్యాంప్ లున్నాయి. 3 అంబులెన్స్​లను అందుబాటులో ఉంచారు.  

పార్కింగ్ ఏరియాలు..

సెయింట్ జాన్ రోటరీ, స్వీకార్​- ఉప్​కార్, ఎస్బీఐ  వైపు నుంచి వచ్చే భక్తులు తమ వెహికల్స్​ను హరిహర కళాభవన్,​ మహబూబ్  కాలేజీ , ఎస్బీఐటీ కాలేజీ, బెల్సన్ తాజ్ హోటల్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ఏరియాలో  ఉంచాలి. సుభాష్ రోడ్‌‌ నుంచి వచ్చే వెహికల్స్​ను పాత జైల్​ఖానా ఓపెన్ ప్లేస్‌‌లో, కర్బాలా మైదాన్,  బైబిల్ హౌస్, ఘాస్​మండి వైపు నుంచి వెహికల్స్​ను ఇస్లామియా హైస్కూల్‌‌లో.. రాణిగంజ్, ఆదయ్య క్రాస్ రోడ్ వైపు నుంచి వచ్చే వెహికల్స్ ను  ఆదయ్య మెమోరియల్ ప్రభుత్వ హైస్కూల్​లో.. రసూల్‌‌పురా, సీటీవో, బాలంరాయి నుంచి వచ్చే వెహికల్స్​ను  ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం వద్ద పార్క్​ చేయాలి.

దర్శనానికి వచ్చే వారికి ఇలా..

అమ్మవారి దర్శనం కోసం వస్తున్న  భక్తులకు ఓల్డ్ రాంగోపాల్​పేట పీఎస్, జనరల్ బజార్ జ్యోతి ఫొటో స్టూడియో ప్రాంతాల్లో రెండు క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. భక్తులు ఈ రెండు క్యూ లైన్ల ద్వారా ఆలయం లోపలికి వెళ్లి అమ్మవారిని దర్శించుకోవాలి. ఆలయ కమిటీ ధర్మ కర్తలు, దాతలు, వీఐపీ పాసులున్న వారి కోసం టొబాకో బజార్​నుంచి, జ్యోతి ఫోటో స్టూడియో వద్ద , అంజలి థియేటర్ వద్ద క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ  క్యూలైన్ల ద్వారా ఆలయ ధర్మకర్తలు, దాతలు, వీఐపీ పాసులు కలిగిన వారిని మాత్రమే అనుమతిస్తారు. ఇక రాజకీయ నేతలు, ప్రముఖలు, వీఐపీలు, వీవీఐపీలను ఓల్డ్ రాంగోపాల్ పేట పీఎస్ నుంచి నేరుగా ఆలయ ప్రధాన ముఖ ద్వారం నుంచి లోపలికి అనుమతిస్తారు.