
ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు చేపట్టిన అంబర్ పేట్ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. పనులు శరవేగంగా పూర్తి చేసేందుకుగానూ పనులు జరుగుతున్న మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. గాంధీ విగ్రహం నుంచి అంబర్ పేట్ టీ జంక్షన్ రోడ్డును ఇవాళ్టి నుంచి మార్చి 10వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆ రూట్‌లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఇక గాంధీ విగ్రహం నుంచి 6 నంబర్ బస్టాప్ వరకూ వెళ్లే మార్గంలో ఒకవైపు మాత్రమే వాహనాలను అనుమతించనున్నట్లు ప్రకటించారు.
ఉప్పల్ వైపు నుంచి 6 నంబర్ బస్టాప్ మీదుగా చాదర్‌ఘాట్ వెళ్లే భారీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు హబ్సిగూడ క్రాస్ రోడ్స్ నుంచి తార్నాక, ఉస్మానియా వర్సిటీ, అడిక్‌మెట్ ఫ్లై ఓవర్, విద్యానగర్, ఫీవర్ ఆస్పత్రి, బర్కత్‌పురా, నింబోలి అడ్డా వైపునకు మళ్లించనున్నారు. ఇక ఇదే మార్గంలో వెళ్లే సిటీ బస్సులు, సాధారణ వాహనాలను గాంధీ విగ్రహం నుంచి ప్రేమ్ సదన్ బాయ్స్ హాస్టల్, సీపీఎల్ అంబర్‌పేట్ గేట్, అలీ కేఫ్ క్రాస్ రోడ్స్, ఛే నంబర్ బస్టాప్, గోల్నాక, నింబోలి అడ్డా మీదుగా చాదర్‌ఘాట్ వైపు పంపనున్నారు. ఛే నంబర్ బస్టాప్ వైపు నుంచి ఉప్పల్ వైపు వెళ్లే అన్ని వాహనాలకు చాదర్ ఘాట్ వైపు నుంచి అనుమతించనున్నారు.