అశోక్​నగర్​ – ఆర్టీసీ క్రాస్​రోడ్ రూట్​లో ట్రాఫిక్ ఆంక్షలు

అశోక్​నగర్​ – ఆర్టీసీ క్రాస్​రోడ్ రూట్​లో ట్రాఫిక్ ఆంక్షలు
  •     స్టీల్ బ్రిడ్జి నిర్మాణం కారణంగా వెహికల్స్ దారి మళ్లింపు
  •     వాహనదారులు ఇతర రూట్లలో వెళ్లాలి: ట్రాఫిక్ చీఫ్​ సుధీర్ బాబు

ముషీరాబాద్, వెలుగు: ఇందిరా పార్క్ నుంచి వీఎస్టీ వరకు చేపట్టిన నాలుగు లేన్ల స్టీల్ బ్రిడ్జి నిర్మాణం పనులు తొందరగా పూర్తి చేయాలని  ఇటీవల మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయం నేపథ్యంలో..  నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా బ్రిడ్జికి ఇరువైపులా రోడ్లను మూసివేస్తున్నట్లు  అడిషనల్ సీపీ, ట్రాఫిక్ సుధీర్ బాబు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అశోక్​నగర్ చౌరస్తా నుంచి ఆర్టీసీ క్రాస్​రోడ్ వరకు ఇరువైపులా రోడ్లను మూసివేసి ప్రత్యామ్నాయ మార్గాలపై ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్​రోడ్ నుంచి అశోక్​నగర్ వెళ్లేవారు చిక్కడపల్లి సుధా హోటల్ లైన్, సిటీ లైబ్రరీ, అశోక్ నగర్ చౌరస్తా నుంచి లెఫ్ట్ తీసుకొని ఇందిరా పార్కు మీదుగా జర్నీ చేయాల్సి ఉంటుందన్నారు. చిక్కడపల్లికి వెళ్లేవారు జగదాంబ హాస్పిటల్, ఆంధ్రా కేఫ్, హెర్బన్ చర్చి నుంచి చిక్కడపల్లి మెయిన్​రోడ్డుకు చేరుకోవాలి. వాహనదారులు ట్రాఫిక్ డైవర్షన్లను గమనించాలని ఆయన కోరారు. సమస్యలుంటే పోలీస్ హెల్ప్ లైన్ 9010203626 నంబర్​ను సంప్రదించాలన్నారు.