శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి

హైదరాబాద్ :  కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల బలవన్మరణాలు కొనసాగుతున్నాయి. సోమవారం (ఆగస్టు 14న) సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగులూర్ సమీపంలోని శ్రీ చైతన్య ఐఐటీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. 

పోలీసులు, విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం..

ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని బొంగులూరులో (పాత జేఎన్ఐటీ బిల్డింగ్) ప్రస్తుతం శ్రీ చైతన్య జూనియర్ కళాశాల, రామానుజం భవన్ లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతున్న విద్యార్థి చింతకుంట గౌతమ్(15) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సోమవారం రోజు సాయంత్రం 5 గంటల 10 నిమిషాల సమయంలో బుక్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్ లోని రూమ్ నెంబర్ 122కి వెళ్లాడు. అదే రూమ్ లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారు. 

గౌతమ్ స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా. ఇటీవలే కండ్ల కలక రావడంతో నాగర్ కర్నూల్ కు వెళ్లాడు గౌతమ్. నాగర్ కర్నూల్ కు చెందిన నిహాల్, సాయివివేక్, సంకల్ప్ తో కలిసి సోమవారం (ఆగస్టు 14న) ఉదయం కళాశాలకు వచ్చాడు. అయితే.. అనుమానాస్పద స్థితిలో గౌతమ్ చనిపోయినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. ఈ విషయమై శ్రీ చైతన్య యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేసింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా మార్చురీకి తరలించారు.

శ్రీ చైతన్య ఐఐటీ అకాడమీలో నిరసన తెలియజేయడానికి వచ్చిన ఎన్ఎస్యూఐ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో  విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.