
- మృతుల్లో అక్కాతమ్ముడు.. మూడు కుటుంబాల్లో విషాదం
- రంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో ఘటన
- ఈతకెళ్లి నలుగురు పిల్లలు మృతి
- రంగారెడ్డి జిల్లా తాటిపర్తిలో దుర్ఘటన
ఎల్బీ నగర్, వెలుగు: ఈతకు వెళ్లిన నలుగురు పిల్లలు నీటిలో మునిగి చనిపోయారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తిలో ఆదివారం జరిగింది. యాచారం ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం సెలవులు కావడంతో తాటిపర్తి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు గ్రామ శివారులోని చెరువులో ఈతకు వెళ్లారు. ఈత రాకపోయినా చెరువులో దిగి, ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు. మృతుల్లో ముగ్గురు బాలురు, ఒక బాలిక ఉన్నారు. పిల్లలు చెరువులో పడిపోయారని గొల్లగూడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో గ్రామస్తులు, చిన్నారుల తల్లిదండ్రులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు.
చెరువులో గాలించి పిల్లలను బయటకు తీయగా వారు అప్పటికే చనిపోయారు. మృతుల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న మొహమ్మద్ ఖాలిద్ (12), పదో తరగతి చదువుతున్న కుమారీ సమ్రీన్ (14), ఐదో తరగతి విద్యార్థి మొహమ్మద్ రేహాన్ (10), నాలుగో తరగతి విద్యార్థి షేక్ ఇమ్రాన్ (9) ఉన్నారు. వారిలో ఖాలిద్, సమ్రీన్ అక్కాతమ్ముడు కాగా రేహాన్, షేక్ ఇమ్రాన్ సమీప బంధువులు. ప్రమాదంపై యాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పిల్లల మృతి విషయం తెలియగానే గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తాటిపర్తి చెరువు వద్దకు చేరుకున్నారు. విగత జీవులుగా పడి ఉన్న పిల్లల మృతదేహాలను చూసి తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదించారు. వారిని ఓదార్చడం ఎవరి వల్లా కాలేకపోయింది. మృతదేహాలను పోస్ట మార్టం కోసం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.