
నిజామాబాద్/కోటగిరి, వెలుగు: వర్షానికి తడిసిన పాత రైస్‌మిల్లు గోడ పక్కనే ఉన్న రేకుల షెడ్‌పై కూలడంతో నిద్రలో ఉన్న తండ్రి, రెండు నెలల కూతురు అక్కడికక్కడే చనిపోయారు. శిథిలాల కింద ఉన్న తల్లిని స్థానికులు బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించగా, ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. నిజామాబాద్జిల్లా కోటగిరి మండలకేంద్రంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఇందూర్మహేశ్(25), మహేశ్వరి(23) దంపతులు, రెండు నెలల పాప గౌతమితో కలిసి ఎస్సీవాడలోని రేకుల షెడ్ ఇంట్లో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ బతుకుతున్నారు.
మహేశ్తల్లిదండ్రులు ఇందూర్సాయిలు, రామవ్వ వారి వద్దే ఉంటున్నారు. సోమవారం రాత్రి భోజనాలు చేసి నిద్ర పోయారు. పక్కనే ఉన్న పాత రైస్‌మిల్లు గోడ వర్షాలకు తడిసి మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో రేకుల షెడ్‌పై ఒక్కసారి కూలింది. చప్పుడు విని పక్కనే మరో రూమ్‌లో నిద్రిస్తున్న సాయిలు, రామవ్వ బయటకు వెళ్లి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి శిథిలాలు తొలగించి చూడగా మహేశ్, కూతురు గౌతమి అప్పటికే చనిపోయారు.
కొన ఊపిరితో ఉన్న మహేశ్వరిని అంబులెన్స్‌లో బోధన్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఘటనతో మహేశ్తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. భగవంతుడు తమను తీసుకెళ్లి, కొడుకు, మనువరాలిని చల్లగా చూడాల్సిందని కన్నీరుమున్నీరయ్యారు. పాత రైస్ మిల్లు కూల్చేయాలని ఓనర్‌కు ఎన్ని సార్లు చెప్పినా వినలేదని కాలనీవాసులు తెలిపారు. మృతుడి తండ్రి సాయిలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కోటగిరి ఎస్సై సునీల్తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు కట్టుకుందాం అనుకునే లోగా..
ఇందూర్మహేశ్ఫ్యామిలీకి ప్రభుత్వం ఐదు నెలల కింద ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది. భార్య మహేశ్వరి గర్భంతో ఉండడంతో, సెంటిమెంట్ప్రకారం డెలివరీ అయ్యాక పనులు ప్రారంభించాలని ఆగాడు. డెలివరీ అయ్యి రెండు నెలలు దాటడంతో పనులు మొదలుపెట్టేందుకు రెడీ అవుతుండగా, రైస్ మిల్లు గోడ కూలి తండ్రి, కూతురు చనిపోవడం స్థానికులను కలిచివేసింది.