మేడ్చల్ జిల్లాలో దారుణం.. వెంటాడి కారుతో ఢీకొట్టి చంపేశారు

మేడ్చల్ జిల్లాలో దారుణం.. వెంటాడి కారుతో ఢీకొట్టి చంపేశారు

మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు దుండగులు. వేణు అనే వ్యక్తిని షిఫ్ట్ కారుతో ఢీకొట్టి... ఆ తర్వాత గొంతు కోసి చంపేశారు. జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నాపురం చెరువు వద్ద శనివారం (సెప్టెంబర్ 9న) ఈ ఘటన జరిగింది.

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వేణు అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు టూవీలర్ పై వెళ్తున్న వేణును వెంటాడి కారుతో ఢీ కొట్టారు. అనంతరం కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో వేణు మెడ భాగంలో తీవ్ర గాయాలై.. రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

 

విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. హ‌త్య జ‌రిగిన ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా ప‌రిశీలించి, ఆధారాలు సేకరిస్తున్నారు. కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరిస్తున్నారు. వేణుపై పథకం ప్రకారమే హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేణును హ‌త్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

పాత క‌క్షల కార‌ణంగానే వేణును మ‌ర్డర్ చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం వేణు డెడ్‌బాడీని గాంధీ మార్చురీకి త‌ర‌లించారు. హత్య చేసిన తర్వాత నిందితులు ఘటనా స్థలంలోనే కారును వదిలి పారిపోయారు. వేణుకు గతంలో ఎవరితో అయినా గొడవలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.