పెళ్లి కొడుకుకు ఫస్ట్ నైట్.. పెళ్లి కూతురికి అదే లాస్ట్ నైట్.. శోభనం టైంకు ప్రాణాలొదిలేసిన వధువు !

పెళ్లి కొడుకుకు ఫస్ట్ నైట్.. పెళ్లి కూతురికి అదే లాస్ట్ నైట్.. శోభనం టైంకు ప్రాణాలొదిలేసిన వధువు !

అమ్మాయిది ఆంధ్రాలోని అనంతపురం జిల్లా. అబ్బాయిది అక్కడికి సరిహద్దు ప్రాంతమైన కర్ణాటక. అమ్మాయి లక్షణంగా ఉంది. అబ్బాయి కూడా అమ్మాయికి నచ్చాడు. దీంతో.. కట్నకానుకలు మాట్లాడుకుని అన్నీ కుదరడంతో ఈ ఇద్దరికీ పెద్దలు పెళ్లి నిశ్చయించారు. సోమవారం (ఆగస్ట్ 04) పగలు ముహూర్తానికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. పెళ్లిలో, పెళ్లి అనంతరం నిర్వహించిన రిసెప్షన్లో.. పెళ్లి ఫొటోల్లో అమ్మాయి సంతోషంగా కనిపించింది. ఆమెకు పెళ్లి ఇష్టం లేదనే తరహాలో ఎక్కడా ఆమె ముఖకవళికలు, ప్రవర్తన కనిపించలేదు.

పెళ్లి ఘనంగా జరిగింది. ఆ తర్వాత తంతైన శోభనానికి అదే రోజు రాత్రి ఏర్పాట్లు చేస్తున్నారు. పెళ్లి జరిగిన ఇల్లు కావడంతో ఇల్లంతా సందడిగా ఉంది. ఎవరి పనుల్లో వాళ్లు నిమగ్నమై ఉన్నారు. శోభనానికి అన్ని ఏర్పాట్లు చేశారు గానీ స్వీట్లు మర్చిపోయారు. సమయానికి ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్వీట్ల కోసం పెళ్లి కొడుకే స్వయంగా స్వీట్ షాపునకు వెళ్లాడు. పెళ్లి కొడుకు స్వీట్లు తీసుకుని ఇంటికి తిరిగిచ్చే లోపు గదిలో ఉన్న వధువు ఫ్యాన్కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఆ దృశ్యం చూసి వరుడి హృదయం ముక్కలైంది.

పెళ్లైన శుభ సందర్భంలో తన భార్యకు స్వీటు తినిపించి.. తనతో స్వీటు తినిపించుకుని నోరు తీపి చేసుకుందామనుకుంటే వధువు చనిపోయిందనే చేదు నిజం వరుడి చెవిన పడింది. ఇంత విషాదమైన రోజు తన జీవితంలో ఒకటి ఉంటుందని ఆ యువకుడు కలలో కూడా ఊహించలేదు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన హర్షిత(22)కు, కర్ణాటకలోని దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో సోమవారం పెళ్లి జరిగింది. ఉదయం పెళ్లి జరిగింది. రాత్రి తన గదిలోకి వెళ్లి హర్షిత ఉరేసుకుని ప్రాణం తీసుకుంది.

గదిలోకి వెళ్లిన హర్షిత ఎంత పిలిచినా బయటకు రాకపోవడంతో తలుపులు పగలగొట్టి చూడగా ఫ్యాన్కు ఉరేసుకుని కనిపించింది. హర్షితను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే.. అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఉదయం పెళ్లి కళతో సందడిగా ఉన్న ఆ ఇంటిని స్మశాన నిశ్శబ్దం కమ్మేసింది. పెళ్లి కొడుకుతో సహా ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.