- కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలో దారుణం
జమ్మికుంట, వెలుగు: అన్నదమ్ములు గొడవ పడుతుండడంతో ఆపేందుకు వెళ్లిన తండ్రిని పెద్ద కొడుకు రోకలిబండతో కొట్టి హత్య చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలంలోని చిన్నకోమటిపల్లి గ్రామంలో శుక్రవారం జరిగింది. ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చిట్ల సంపత్ (60)కు శ్రీనివాస్, శ్రీధర్ కొడుకులు. భూమి కౌలు విషయంలో అన్నదమ్ములు శ్రీనివాస్, శ్రీధర్ మధ్య గొడవ మొదలైంది.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దూషించుకుంటూ ఉండగా.. శ్రీనివాస్ రోకలి బండతో శ్రీధర్‌ను కొట్టేందుకు ప్రయత్నించాడు. గమనించిన సంపత్ కలుగజేసుకొని శ్రీనివాస్‌ను వారించే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ తండ్రిని అసభ్య పదజాలంతో దూషిస్తూ, తన చేతిలో ఉన్న రోకలిబండతో తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సంపత్‌ను మొదట జమ్మికుంట హాస్పిటల్‌కు, అక్కడి నుంచి వరంగల్‌కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తాగొచ్చి తల్లిని కొడుతుండని తండ్రిని చంపిన కొడుకు
కరీంనగర్ క్రైం, వెలుగు : మద్యం సేవించి రోజూ గొడవ పడుతూ, తల్లిని కొడుతుండడంతో ఆగ్రహానికి గురైన ఓ యువకుడు తండ్రిని హత్య చేశాడు. కరీంనగర్ జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట గ్రామానికి చెందిన అరెళ్ల నర్సయ్య (55) భార్య గంగవ్వ, ఇద్దరు కొడుకులు ఓ కూతురితో కలిసి నగరంలోని కశ్మీర్‌గడ్డలో ఉంటున్నాడు. నర్సయ్య శుక్రవారం సాయంత్రం మద్యం తాగొచ్చి గొడవ చేయడంతో పాటు గంగవ్వను కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన పెద్ద కొడుకు మల్లేశ్ గొడ్డలితో తండ్రి తలపై కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ నర్సయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
